చైనా లో మరో కొత్త వైరస్.. ఇప్పటికే ఏడుగురు మృతి
posted on Aug 6, 2020 9:44AM
చైనాలోని వుహాన్ లో మొదలైన కరోనా వైరస్ ఇపుడు ప్రపంచం మొత్తాన్ని చుట్టేసి మానవాళిని కబళిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు దీనికి సరైన ట్రీట్ మెంట్ లేదు అలాగే దీనిని ఎదుర్కునే వ్యాక్సిన్ కూడా రాలేదు. ఇది ఇలా ఉండగా తాజాగా చైనాలో మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. అంతే కాకుండా ఈ వైరస్ సోకి ఇప్పటికే ఏడుగురు మరణించారు. కీటకాల ద్వారా వ్యాపించే ఈ వైరస్ దాదాపు 60 మందికి పైగా సోకింది. బుధవారం చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ ఈ సమాచారాన్ని ప్రచురించింది. తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో గత నెలలో 37 మందికి పైగా SFTS Virus బారిన పడ్డారు.
తాజాగా తూర్పు చైనాలోని అన్హుయి ప్రావిన్స్‌లో 23 మందికి ఈ వైరస్ సోకినట్లుగా గుర్తించినట్లు అధికారిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. వైరస్ బారిన పడిన జియాంగ్సు రాజధాని నాన్జియాంగ్‌కు చెందిన ఒక మహిళ మొదట్లో దగ్గు, జ్వరం లక్షణాలతో మొదలై తరువాత ఆమె శరీరంలో ల్యూకోసైట్స్, ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గినట్లు వైద్యులు గుర్తించారు. దాదాపు ఒక నెల చికిత్స తర్వాత ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
తాజా నివేదిక ప్రకారం తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో కనీసం ఏడుగురు వైరస్ కారణంగా మరణించారు. ఐతే ఈ SFTS వైరస్ కొత్తది కాదు. దీనిని చైనాలో 2011 లోనే కనుగొన్నారు. జంతువుల శరీరానికి అతుక్కుని ఉండి, తరువాత మానవులకు వ్యాపించే నల్లి (టిక్) వంటి కీటకాల ద్వారా ఈ వైరస్ మానవులకు వ్యాపిస్తుందని వైరాలజిస్టులు పేర్కొన్నారు. ఈ వైరస్ మనుషులకే కాక మనం పెంచుకునే మేకలు, బర్రెలు, గుర్రాలు, పందులకు కూడా సోకుతుందని తెలుస్తోంది. అంతే కాకుండా ఇప్పటికే దీనిపై స్టడీ చేసిన అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం దీనిని అదుపు చేయకపోతే మరో మహమ్మారిగా మారి ఇటు మానవాళికి అటు జంతువులకు కూడా తీవ్ర నష్టం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.