బడ్జెట్ లో తెలంగాణను విస్మరించిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తెలంగాణకు రిక్తహస్తమే చూపింది. బడ్జెట్ కు ముందు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చేసిన విజ్ఞప్తులేవీ కేంద్ర విత్తమంత్రి పట్టించుకోలేదు.   గతేడాది అప్పుల కోసం రాష్ట్ర బడ్జెట్‌లో అంచనాలు భారీగానే వేసుకున్నా మూడింట ఒక వంతు భాగానికి కేంద్ర ప్రభుత్వం వివిధ కారణాలతో కోత పెట్టింది. మరో రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో గతేడాది తరహాలోనే రిజర్వు బ్యాంకు ద్వారా రుణాలు తీసుకోడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అయితే కేంద్ర బడ్జెట్‌లో ఎఫ్ఆర్‌బీఎం గురించి స్పష్టత ఇవ్వడంతో ఈసారి కూడా రుణాల లభ్యత   కష్టంగానే ఉంటుందని స్పష్టమైపోయింది.

రాష్ట్ర జీఎస్‌డీపీలో 3.5% మేర రుణాలు తీసుకోవచ్చని కేంద్రం చెప్పినా దానిని విద్యుత్ సంస్కరణలకు ముడిపెట్టింది. అంటే విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తేనే   0.5% మేర అధిక రుణాలు పొందడానికి అవకాశం ఉంటుంది. లేకుంటే రాష్ట్రానికి రుణ లభ్యత 3.0% మాత్రమే. తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచీ విద్యుత్ సంస్కరణలను అమలు చేసే ప్రసక్తే లేదని క్లారిటీతోనే ఉంది. అందుకే రాష్ట్ర జీఎస్‌డీపీలో 3.5% మేర రుణాలు కాకుండా, 3.0% రుణానికే అవకాశం ఉంటుంది. అంటే  దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల మేర రుణానికి కోత తప్పదు.  మరో వైపు కేంద్రం  నుంచి గ్రాంట్ల రూపంలో ఆశించిన స్థాయిలో రాకపోవచ్చనే అభిప్రాయాన్ని కూడా రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు అంటున్నారు.  ప్రీ-బడ్జెట్ సమావేశంలో హరీశ్‌రావు లిఖితపూర్వకంగా చేసిన విజ్ఞప్తులేవీ కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులపైనా కేంద్ర బడ్జెట్‌లో క్లారిటీ ఇవ్వలేదు.

కేంద్ర బడ్జెట్ బిజినెస్, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఒకవైపు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కోత పెట్టిందని, పని దినాల పెంపును కనీసం ప్రస్తావించలేదని అంటున్నారు.   మూలధన వ్యయం కేటాయింపులు పెంచడం లాంటివి కనిపించడం ఒక పాజిటివ్ సంకేతమైనా.. మెజారిటీ పేదల సంక్షేమం విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో కేంద్రం నుంచి స్పందన లేదని పేర్కొన్నారు. చివరాఖరికి రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కేంద్ర సంక్షేమ పథకాల అమలు కోసం విడుదలైన నిధులు పొరపాటున ఏపీ రాష్ట్ర ఖాతాలోకి వెళ్ళిపోయాయని, వాటిని సర్దుబాటు చేయాలన్న విజ్ఞప్తిని సైతం పట్టించుకోలేదని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.