బాబు మొదలెట్టేశారు.. పాలన ఇక పరుగులే!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన మార్క్ పని తీరును చూపుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై   వరుస సమీక్షలు నిర్వహించనున్నారు. అలాగే శాఖల వారీగా సమీక్షలకు సైతం ఆయన రెడీ అయిపోయారు. వర్షా కాలం కావడంతో ఆయన తొలుత వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష చేయాలని నిర్ణయించారు. శుక్రవారం (జూన్ 28) సాయంత్రం నాలుగు గంటలకు ఆయన వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నివారణకు తీసుకోవలసిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తారు. అలాగే ఆ శాఖలో తక్షణం చేపట్టాల్సిన చర్యలు, దీర్ఘకాళిక ప్రణాళికపై చర్చించనున్నారు. 

అదలా ఉండగా ఆయన అధికారుల నియామకాలపై కూడా దృష్టి పెట్టారు. ఇప్పటికే తన ముఖ్య కార్యదర్శిగా పీయూష్ కుమార్ ను నియమించారు. ఆర్థిక శాఖ బాధ్యతలను కూడా ఆయనకు అదనంగా అప్పగించారు. ఇక కీలకమైన ఇంటెలిజెన్స్ చీఫ్ గా మహేష్ చంద్ర లడ్డాను నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే చంద్రబాబు లడ్డాను కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేసి రాష్ట్రానికి పంపాలని లేఖ రాశారు. ఆయన లేఖ మేరకు లడ్డాను రాష్ట్ర సర్వీసుకు పంపిస్తే కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 1988 ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన లడ్డా 2019లో విశాఖ పోలీసు కమిషనర్ గా పని చేశారు.  నిజయతీపరుడు, సమర్ధుడైన అధికారిగా పేరున్న లడ్డాను ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించే అవకాశాలున్నాయని అంటున్నారు. 

ఇక జగన్ హయాంలో  ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు అధికారులకు సైతం చంద్రబాబు సర్కార్ పోస్టింగులు ఇచ్చింది.  వారిలో జగన్ ఆడమన్నట్లల్లా ఆడి ఆయన తొత్తుగా పని చేశారన్న ఆరోపణలు ఎదుర్కొని చంద్రబాబు సర్కార్ వచ్చాకా సెలవుపై వెళ్లిన మాజీ సీఎస్ జవహర్ రెడ్డికి సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పోస్టింగ్ లభించింది. ఆయన త్వరలో పదవీ విరమణ చేయనున్న సంగతి విదితమే. ఇక జగన్ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్యకు సాధారణ పరిపాలన శాఖలో ప్రధాన కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు.  

అదే విధంగా తొలి కేబినెట్ లో నిర్ణయించిన విధంగా శ్వేతపత్రాల విడుదల విషయంలోనూ చంద్ర బాబు స్పీడ్ పెంచారు. ముందుగా ప్రకటించినట్లుగా పోలవరంపై శుక్రవారం (జూన్ 28) శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ప్రాజెక్టు నిర్మాణ స్థితిగతులపై వాస్తవాలను చంద్రబాబు సర్కార్ ఈ శ్వేత పత్రంలో విడుదల చేయనుంది. కేంద్రం నియమించిన అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరం పరిశీలనకు శనివారం (జూన్ 29)న రానున్న సంగతి తెలిసిందే. పోలవరం నిర్మాణాలను పరిశీలించి ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై కేంద్ర బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా పోలవరం పునులను చేపట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది.