జవహర్ రెడ్డి పట్ల బాబు ఉదారత.. మాజీ సీఎస్ సిగ్గుతో చితికిపోయి ఉంటారుగా?

జగన్ అధికారంలో ఉన్నంత కాలం ఆయన అడుగులకు మడుగులొత్తి, ఆయన తొత్తులుగా పని చేసిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇప్పుడు జగన్ సర్కార్ కూలిపోయిన తరువాత చంద్రబాబు సర్కార్ లోనూ మంచి హోదాలలో కొనసాగుతున్నారు. సహజంగానే ఇది తెలుగుదేశం అభిమానులు, శ్రేణులలో తీవ్ర అసంతృప్తికి కారణమైంది.  ఎందుకంటే ఈ అధికారులు జగన్ కు వీర భక్త హనుమాన్ స్థాయిలో జగన్ కు ఊడిగం చేశారు. జగన్  చూసి రమ్మంటే వీరు కాల్చి వచ్చిన చందంగా వ్యవహరించారు. జగన్ మెప్పు పొందడమే లక్ష్యంగా విపక్ష నేతలను, కార్యకర్తలను నానా ఇబ్బందులకూ గురి చేశారు. నిబంధనలనేవి ఉండవనీ, జగన్ కు నచ్చినట్లుగా వ్యవహరించడమే ఏపీలో ఉన్న ఏకైక నిబంధన అని వాళ్లు నమ్మడమే కాుద, జనం కూడా నమ్మి తీరాలు, విపక్షాలూ అందుకు అంగీకరించాలని అన్నట్లుగా కొందరు అధికారుల తీరు జగన్ హయంలో ఉండింది. 

గతంలో అంటే ఎన్నికలకు ముందు పలు సందర్భాలలో చంద్రబాబు క సీనియర్ మోస్ట్ అధికారి ఒకరు హైదరాబాద్ లో తన నివాసానికి మారు వేషంలో వచ్చి జగన్ తీరు గురించి వివరించి ఆయన ఆదేశాలు పాటించకుంటే ప్రాణాలతో ఉంటామన్న నమ్మకం లేదని అన్న సంగతిని చెప్పారు. అయితే చంద్రబాబు ఆ అధికారి పేరు బయటపెట్టలేదు. అదీ చంద్రబాబు మంచితనం, హుందాతనం. ఇప్పుడు కూడా చంద్రబాబు అదే హుందాతనాన్ని మంచి తనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆయన తీరు పట్ల సొంత పార్టీ నేతలూ, క్యాడర్ లో ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతున్నప్పటికీ బై అండ్ లార్జ్ చంద్రబాబు తీరు ఆయన గొప్పతనానికి నిదర్శనమన్న అభిప్రాయమే వ్యక్తం అవుతోంది. 

జగన్ హయాంలో ఆయనకు తొత్తుగా, నిబంధనలు అన్నవి ఉంటాయన్న స్ఫృహే లేకుండా ఇష్టారీతిగా వ్యవహరించిన మాజీ సీఎస్ జవహర్ రెడ్డికి బాబు ఎంతో ఉదారంగా, హుందాగా ఆయన రిటైర్ అయ్యే చివరి రోజు పోస్టింగ్ ఇచ్చారు. అలాగే నిబంధనలను తుంగలోకి తొక్కి జగన్ అడుగులకు మడుగులొత్తేలా పని చేసిన మరో ఐఏఎస్ అధికారిణి పూనం మాలకొండయ్యకూ ఆమె రిటైర్మంట్ కు ముందు రోజే పోస్టింగ్ ఇచ్చి గౌరవంగా రిటైర్ అయ్యే అవకాశం కల్పించారు. 

కక్షలూ కార్పణ్యాలూ తన నైజం కాదనీ ఈ చర్యల ద్వారా చంద్రబాబు విస్పష్టంగా చాటారు. సరిగ్గా రిటైర్మెట్ రోజున పోస్టింగ్ ఇచ్చి మర్యాదగా, గౌరవంగా రిటైరయ్యే అవకాశం దక్కడం నిజంగా జవహర్ రెడ్డి కూడా ఊహించి ఉండరు. చంద్రబాబు హుందాతనం, ఉదారత్వం చూసి ఆయన సిగ్గుతో తలదించుకునే ఉంటారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీవీ విషయంలో జగన్ ఆదేశాల మేరకు తానెంత కర్కశంగా, కృూరంగా వ్యవహరించానో జవహర్ రెడ్డికి గుర్తొచ్చే ఉంటుంది. అప్పటి తన తీరు పట్ల కచ్చితంగా రిపెంట్ అయ్యే ఉంటారు. సిగ్గుతో చితికిపోయే ఉంటారు.