చంద్రబాబు మోడలే ది బెస్ట్!

తెలంగాణను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరో మారు ఆరోపించారు. అంతే కాదు, కొట్లాడకపోతే కేంద్రం నిధులివ్వదు.. పోరాడాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హిత బోధ కూడా చేశారు. అలాగే  మరో అడుగు ముందుకేసి  కేంద్రంపై పోరాడేందుకు రేవంత్ ప్రభుత్వానికి మద్దతిస్తామని  కేటీఆర్ సభా ముఖంగా ప్రకటించారు. అయితే, కేటీఆర్  ప్రతిపాదన   నాలాగా వర్ధిల్లు..  అన్నట్లు ఉందని  అంటున్నారు. అవును  బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం పై చేసిన యుద్ధం వలన రాష్ట్రానికి మేలు జరగలేదు సరికదా, బీఆర్ఎస్ కు ఆశించిన రాజకీయ ప్రయోజనం కూడా లభించలేదు. అందుకే కేటీఆర్ ఉద్భోధ   నాలాగా వర్ధిల్లు.. అన్నట్లు ఉందని  అంటున్నారు.  

నిజమే కావచ్చును  తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదన్నది ఎంతో కొంత నిజం కావచ్చును. అలాగే, కేంద్ర ప్రభుత్వం బీజేపీ/ఎన్డీఏ యేతర ప్రభుత్వాల పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతోందనే ఆరోపణలోనూ నిజం లేక పోలేదు. నిజానికి డబుల్ ఇంజిన్ సర్కార్  నినాదంతో  తెలంగాణలోనూ పాగా వేసేందుకు పావులు కదుపుతున్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం  తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందనే ఆరోపణను తోసివేయలేము .   

అయితే  కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు  కేటీఆర్  ప్రవచించినట్లు కయ్యం ఒక్కటే మార్గమా? అంటే, కాదు. తెలంగాణ అనుభవమే కాదు  మరి కొన్ని రాష్ట్రాల అనుభవం కూడా  కేంద్రంతో నిరంతర కయ్యం రాష్ట్రానికి మంచిది కాదనే చెబుతోందని  రాజకీయ విశ్లేషులు అంటున్నారు. ఒక విధంగా కేంద్రంతో నిరంతర సంఘర్ష ధోరణి  బీజేపీ ప్రవచించే డబుల్ ఇంజిన్  సర్కార్’ నినాదానికి బలాన్ని చేకూర్చే ప్రమాదం కూడా లేక పోలేదని  నిన్నమొన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిందీ అదే అని విశ్లేషకులు అంటున్నారు.  

మరోవంక  కేంద్రంతో సయోధ్యతో ఉంటే ఏమేమి సాధించుకోవచ్చునో  ఏమేమి సాధించుకున్నామో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే సభలో వివరించారు.ఇందుకు సంబంధించి  చాలా పెద్ద  చిట్టానే  ఆయన శాసన సభలో వినిపించారు. ముఖ్యమంత్రి పదే పదే ఢిల్లీ వెళుతున్నారని, ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ చేస్తున్న విమర్శకు సమధానంగా రేవంత్ రెడ్డి  ఎప్పుడెప్పుడు ఢిల్లీ వెళ్ళిందీ,  ఏ కేంద్ర మంత్రిని కలిసింది, ఏమి సాధించుకొచ్చిందీ, తారీకులతో సహా వివరించారు. అలాగే వికారాబాద్ లో రాడార్ కేంద్రం శంకుస్థాపన సందర్భంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో రాష్ట్రాభివృద్ది కోసం రాజకీయాలకు అతీతంగా కేంద్రంతో కలిసి పనిచేస్తామని  రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిజానికి  ఆ ఒక్క సందర్భంలో మాత్రమే కాదు, ఇంకా అనేక సందర్భాలలో, అనేక వేదికల నుంచి కూడా రేవంత్ రెడ్డి , ఇదే విషయం స్పష్టంగా చెప్పారు. 

నిజానికి, కేంద్ర రాష్ట సంబంధాల విషయంలో రాజకీయాల  ప్రమేయం ఎంత తక్కువగా ఉంటే రాష్ట్రానికి అంత మేలు జరుగుతుందని చరిత్ర చెపుతోంది. ఒకప్పుడు కేంద్రంలో వాజ్ పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు.. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు  కేంద్ర రాష్ట్ర సంబంధాలకు ఓ ‘ టెక్స్ట్ బుక్  మోడల్’ గా నిలిచారు. ఎన్డీఎ మిత్ర పక్షంగా ఢిల్లీలో  చక్రంతిప్పారు.  కేంద్రానికి అన్ని విధాలా సహకరించారు. వాజపేయి ప్రభుత్వానికి తలలో నాలుకగా వ్యవహరించారు. కొన్ని సందర్భాల్లో అటల్జీ సర్కార్ ను రాజకీయ, పరిపాలనా చిక్కులోంచి బయట పడేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనాలను వదులుకుని కేంద్రతో  కలిసి నడిచారు. రాష్ట్రానికి పెద్ద మొత్తంలో కేంద్ర నిధులను సాధించారు. అప్పట్లో చంద్రబాబు ముఖ చిత్రంతో వెలువడిన  ఇండియా టుడే  పత్రిక కేంద్ర నిధుల వేట గాడు.. చంద్రబాబు అనే మకుటంతో ముఖ చిత్ర కథనాన్ని ప్రచురించింది. చంద్రబాబు, రాజనీతిజ్ఞకు ఇదొక నిదర్శనంగా అప్పట్లో మేథావులు మెచ్చుకున్నారు. 
అప్పుడే కాదు ఇప్పడు కూడా ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి  కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్రాన్ని ముందుకు తీసుకు పోతున్నారు. గత వైసీపీ  హయాంలో గాడి తప్పిన రాష్ట్ర ప్రగతిని  పట్టాల పైకి తెచ్చి పరుగులు తీయిస్తు న్నారు.అందుకే  కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా ఉండాలీ అంటే  చంద్రబాబు మోడల్  ది బెస్ట్ మోడల్  అంటున్నారు. 

అవును  నిజానికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్  ఉద్భోదిస్తున్న సంఘర్షణ వైఖరి  రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే కాకుండా, రాజకీయంగానూ అంత మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మధ్యనే జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి,  నేషనల్ కాన్ఫరెన్స్  నాయకుడు  ఉమర్ అబ్దుల్లా   జమ్మూ కశ్మీర్  ప్రజల సంక్షేమం కోసం,కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. కాదని  కేజ్రీవాల్  తరహాలో కేంద్రంతో నిత్య సంఘర్షణకు దిగితే కేజ్రీవాల్ తరహ ఫలితాలను స్వీకరించడానికి సిద్దంగా ఉండవలసి వస్తుంది  అని అన్నారు. 

అలాగని  కేంద్ర ప్రభుత్వం ఏమి చేసినా అణిగి మణిగి ఉండవలసిన అవసరం లేదనీ, కేంద్ర రాష్ట్ర సంబంధాలను లోతుగా అధ్యయనం చేసిన రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.అది అంత క్షేమకరం అభిలషణీయం కూడా కాదని అంటున్నారు. అలాగే  అయిన దానికీ  కాని దానికీ కయ్యానికి కాలుదువ్వడం కూడా  అంత క్షేమకరం కాదనీ సమయానుకూలంగా శత్రుమిత్ర సంబంధాలు ఉండాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు. నిజానికి  ఢిల్లీలో కేజ్రీవాల్ ఓటమికి అయినా  అంతకు ముందు తెలంగాణలో బీఆర్ఎస్  ఓటమికి అయినా  కేటీఆర్  స్వయంగా పేర్కొనట్లుగా  మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ జీరో స్కోర్ కు అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల శత్రుమిత్ర సంబంధాలే కారణం కానక్కర లేదు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ  కేంద్ర ప్రభుత్వం పై తిరుగులేని పోరాటం చేస్తూనే, వరసగా విజయం సాధిస్తున్నారు. మరోవంక, ఏపీలో అవినీతి కేసుల ఉచ్చు నుంచి తప్పించుకేందుకు,  జగన్మోహన్ రెడ్డి  సదా మీ సేవలో... అన్నట్లు కేంద్రానికి సాష్టాంగ  ప్రణామాలు చేశారు.  మరో వంక, కేంద్రం అండ ఉందనే వంకర బుద్దితో రాష్ట్రంలో అరాచక పాలనతో ప్రజలకు దూరమయ్యారు. అందుకే ప్రజలు పదకొండుకు పడగొట్టారు. సో  కేవలం కేంద్ర రాష్ట్రల మధ్య సయోధ్య  ఉంటే సరిపోదు, కేంద్రంతో సయోధ్య  పాటిస్తూ నిధులు, ఇతర ప్రయోజనాలు పొందుతూనే  రాష్ట్ర ఆదాయ వనరులను.  రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పనులకు వినియోగిస్తూ సుపరిపాలన అందిస్తేనే ప్రజలు మెచ్చుకుంటారు. చంద్రబాబు నాయుడు అప్పుడు.. ఇప్పడు ఎప్పడూ అదే ఉభయ తారక విధానం ఫాలో అవుతున్నారు. అందుకే   చంద్రబాబు మోడల్ .. ది బెస్ట్ మోడల్ అంటున్నారు. జమ్మూ కశ్మీర్ అబ్దుల్లా మొదలు తెలంగాణ రేవంత్ రెడ్డి వరకు  చంద్రబాబు బాటలో నడుస్తున్నారు.