16 జిల్లాల్లో ఇసుక సిండికేట్లు ... రాజకీయ నాయకులకు
posted on Apr 6, 2012 7:26AM
16 జిల్లాల్లో ఇసుక సిండికేట్లు ... రాజకీయ నాయకులకు కోట్లలో ముడుపులు
ఎసిబి అధికారుల పుణ్యమా అని మద్యం సిండికేట్లకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి ప్రచారం వచ్చింది. నిజానికి సిండికేట్ విధానం ఒక్క లిక్కర్ వ్యాపారంలోనే కాదు అన్ని రంగాల్లో రాజ్యం ఏలుతోంది. మద్యం సిండికేట్ తర్వాత అదే తరహాలో ఇసుక సిండికేట్ కు పాపులారిటీ వుంది. రాష్ట్రంలో దాదాపు 16 జిల్లాల్లో ఇసుక సిండికేట్ల దందా నసుస్తున్నట్లు తెలుగువన్ డాట్ కామ్ సర్వేలో తేలింది.
ఈ సిండికేట్ లో కూడా కోట్లాది రూపాయలు చేతులు మారుతుంటాయి. ఇసుక ప్రకృతి సిద్ధంగా లభించేదైనప్పటికీ ప్రభుత్వం మైనింగ్ శాఖల ద్వారా ఇసుక లభించే నదీ తీరప్రాంతాలను వేలం వేయడం ద్వారా ఆదాయం పొందుతోంది. వేలం సమయంలోనే కాంట్రాక్టర్లు సిండికేట్ కావడం ఒక పధ్ధతి కాగా ... వేలంలో ఇసుక మైనింగ్ టెండర్లు పొందిన వారంతా సిండికేట్ కావడం మరో పధ్ధతి. రాజకీయ నాయకులకు మద్యం తర్వాత ప్రధాన ఆదాయ వనరు ఇసుక మైనింగ్. ఏడు జిల్లాల్లోని ఇసుక సిండికేట్లలో రాజకీయనాయకులు కూడా బినామీ పేర్లతో సభ్యులుగా వుంటారు. ఇసుక సిండికేట్ల ద్వారా అధికారంలో వున్న నేతలకు 60 శాతం, ప్రతిపక్ష నాయకులకు 40 శాతం ముడుపులు అందుతున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రస్తుతం ఇసుక తవ్వకాలను నిలిపివేశారు. అయితే ఇప్పటికే ఈ సిండికేట్లు పెద్ద ఎత్తున ఇసుకను నిల్వచేసి ఇప్పుడు అధిక ధరలకు విక్రయిస్తూ కోట్లు గడిస్తున్నాయి.