మనిషికి డబ్బుకి మధ్య జరుగుతున్నది ఇదే!
posted on Jan 17, 2024 9:30AM
మానవజీవితానికి డబ్బు కూడా ఓ అవసరం అయిపోయింది ఈ కాలంలో. డబ్బు లేకపోతే ఎన్నో అవసరాలు దూరంగానే ఆగిపోతాయి. అందుకే మనుషులు డబ్బు సంపాదన పట్ల ఆసక్తిగా ఉంటారు. అయితే కొందరు మంచి మార్గంలోనూ, మరికొందరు చెడు మార్గంలోనూ సంపాదిస్తారు. కొందరు అవసరమైనంత మాత్రమే సంపాదించుకుంటు ఉంటారు. కానీ ఎక్కువ భాగం మంది అవసరానికి మించి డబ్బు సంపాదనే పరమావధిగా భావించి అదే మార్గంలో వెళుతుంటారు.
ఓసారి కొందరు సాధువులు తీర్థయాత్రలకు బయలుదేరారు. వారందరి దగ్గరా కంబళ్ళున్నాయి. ఒక సాధువు దగ్గర మాత్రం కంబళి లేదు. ఇంతలో పొంగి ప్రవహిస్తున్న నది వారి దారికి అడ్డం వచ్చింది. నది దాటే ఆలోచన చేస్తూండగా, నదిలో కొట్టుకుపోతున్న కంబళి ఒకటి సాధువు కంటపడింది. అంతే, ఎవరెంత వారించినా వినకుండా ఆ సాధువు నదిలో దూకాడు, ఆ ప్రవాహంలో కష్టపడి ఆ కంబళిని పట్టుకున్నాడు. కానీ నీటిలో కొట్టుకుపోతున్నాడు. మిగిలినవారు అతడిని పిలిచారు. కంబళిని వదిలి ఒడ్డుకి వచ్చేయమన్నారు. కానీ ఆ సాధువు వదలినా కంబళి అతడిని వదలటం లేదు. ఎందుకంటే, అది కంబళి కాదు, ఎలుగుబంటి.
ప్రస్తుతం సమాజం మొత్తం కంబళి అనుకుని ఎలుగు బారిన పడుతోంది. ఉన్నదాంతో సంతృప్తి లేక సుళ్ళు తిరిగే ప్రవాహంలో పడి, కంబళి అనుకొని భల్లూకపు పట్టుకు చిక్కుతుంది. మనమంతా ఈ భ్రమ ప్రలోభంలో పడి ఉన్నవారమే. ప్రస్తుతం, డబ్బు సంపాదన కంబళిలా మనపై భల్లూకపు పట్టు బిగించింది. ఇది ఒక తరం నుంచి మరో తరానికి మరింతగా బిగుస్తూవస్తోంది. ఈ పట్టులో పెరిగి పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. తల్లిదండ్రులవుతున్నారు. ఇదే పట్టును తమ సంతానానికి అందజేస్తున్నారు. వారు పెరిగి పెద్దవారై తమ సంతానానికి వారసత్వంగా ఈ భల్లూకపు పట్టును అందిస్తున్నారు.
అనగనగా ఓ వ్యక్తి. అతనికి ఎదురుగా చేయి చాస్తే అందేంత దూరంలో రంగుల డబ్బు వల కనిపించింది. చేయి సాచి అందుకోబోయాడు. అది కాస్త ముందుకు జరిగింది. దాన్ని అందుకోవాలని దాని వెంట పరుగెత్తాడు. అదీ అంతే వేగంగా ముందుకు జరిగింది. అతను మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా దాని కోసం పరిగెడుతూనే ఉన్నాడు. అలా జీవితమంతా అందని డబ్బు వల వెంట పరుగెడుతూ గడిపాడు. చివరికి విసుగొచ్చి ఒకచోట ఆగిపోయాడు. అప్పుడే వెనక్కి తిరిగి చూశాడు. డబ్బుల వల ఎలాగూ అందలేదు, కానీ వెనుతిరిగి చూస్తే కనిపించింది చేజారిపోయిన జీవితం. అంటే, ఎంతకూ అందని, అందినా సంతృప్తినివ్వని 'డబ్బు' వెంట పడటం వల్ల మనం అమూల్యమైనది, కరిగిపోతే తిరిగి రానిది అయిన జీవితాన్ని విస్మరిస్తున్నామన్నమాట.
అయితే విచిత్రంగా వ్యక్తికి ఈ గ్రహింపు వచ్చేసరికి జీవితం చేజారిపోయి ఉంటుంది. తాను గ్రహించిన ఈ సత్యం తన సంతానానికి వివరించాలనుకుంటే, వినే ఓపిక వారికి ఉండదు. ఎందుకంటే, వారూ ఈ రంగుల వలలో చిక్కుకున్నవారే! ప్రస్తుతం ప్రపంచీకరణ నేపథ్యంలో, వాణిజ్యం అగ్రతాంబూలం అందుకుంటున్న సమాజంలో ప్రతి మనిషీ ఒక డబ్బు మూటగా భావింపబడుతున్నాడు. ప్రతీ వ్యక్తి ప్రపంచపు బజారులో ఒక శాల్తీ గా మాత్రమే పరిగణింపబడుతున్నాడు. తెలిసో తెలియకో, మన ప్రమేయం లేకుండా మనమంతా ఈ విపణిలో శాల్తీలమౌతున్నాం. మన తరువాత తరాలనూ శాల్తీలుగానే పెంచుతున్నాం. ఇదీ నేటిసమాజంలో మనిషి నిర్వాకం.
◆నిశ్శబ్ద.