జేడీఎస్ మేనిఫెస్టోలో బీఆర్ఎస్ పథకాలు
posted on Apr 20, 2023 2:49PM

కర్నాటక ఎన్నికలపై తెలంగాణ ప్రభావం పడుతుందా? తెలంగాణలో బీఆర్ఎస్ అమలు చేస్తున్న పథకాలకు జేడీఎస్ తన మేనిఫెస్టోలో చోటు కల్పించి.. ఎన్నికల రణరంగంలోకి దూకుతోంది. జేడీఎస్ కు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తో సన్నిహిత సంబంధాలున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే ఈ పథకాల ద్వారా తెలంగాణ ఎంతగానో అభివృద్ధి చెందిందని చెప్పుకుంటూ.. ఆ పథకాలకు తన మేనిఫెస్టోలో పెట్టింది.
అధికారికంగా జేడీఎస్ ఇంకా మేనిఫెస్టోను విడుదల చేయకపోయినా... తాము అధికారంలోకి వస్తే వీటిని అమలు చేస్తామంటూ ఓ 12 అంశాలను జేడీఎస్ నేత హెచ్ డి కుమారస్వామి విడుదల చేశారు. వాటిలో తెలంగాణలో అమలుఅవుతున్న రైతు బంధు, ఆసరా ఫించన్లు, అంగన్ వాడీలకువేతనాల పెంపు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు భారీ బడ్జెట్ వంటి అంశాలుఉన్నాయి. అయితే ఇదేమీ కొత్త విషయం కాదు.. తెలంగాణ పథకాలను కర్నాటకలో అమలు చేస్తామని కుమారస్వామి గతంలోనూ హామీ ఇచ్చారు. ఇప్పుడు మేనిఫెస్టోలో పెడతామంటున్నారు.
నిన్న మొన్నటి దాకా స్పష్టత లేకపోయినా.. ఇప్పుడు కర్నాటక ఎన్నికలలో జేడీఎస్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామంటూ తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఆయన ప్రచారం ప్రధానంగా కర్నాటకలో తెలుగు వారు అధికంగా ఉండే నియోజకవర్గాలలో కొనసాగుతుందని అంటున్నారు. రైతుబంధు స్కీమ్ ద్వారా తెలంగాణ రైతుల్లో పెరిగిన జీవన ప్రమాణాల గురించి వివరిస్తారు. అయితే కర్నాటకలో పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉందని ఇప్పటికే పలు సర్వేలు పేర్కొన్నాయి. ముఖ్యంగా పీపుల్స్ పల్స్ ప్రీపోల్ సర్వే రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందన్న సంకేతాలను ఇచ్చింది. రాష్ట్రంలో ఏ పార్టీకీ మేజిక్ ఫిగర్ సాధించి అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలు లేవని పేర్కొంది.
వచ్చె నెల 3వ తేదీన కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అదే నెల 10న ఓట్ల లెక్కింపు.. ఫలితాల విడుదల ఉంటుంది. గురువారం (ఏప్రిల్ 20)తో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో కర్నాటకలో ఏ పార్టీ అధికారం చేపడుతుంది? ఏపార్టీ ప్రతిపక్షానికే పరిమితమౌతుంది అన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగానే కాదు.. కాంగ్రెస్ కు చావో రేవో అన్నట్లుగా మారిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. ఇప్పటికిప్పుడు జనం నాడిని బట్టి హంగ్ వినా మరో అవకాశం లేదన్న మాటే గట్టిగా వినిపిస్తోంది. కొద్ది రోజుల కిందట వెలువడిన పీపుల్స్ పల్స్ ప్రీ పోల్ సర్వే కూడా అదే చెప్పింది. రాష్ట్రంలో అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మధ్య పోటీ నువ్వా నేనా అనే విధంగా ఉంటుందని సర్వే పేర్కొంది. ఈ పోరులో కాంగ్రెస్ పార్టీ స్వల్ప ఆధిక్యత సాధించినా.. అది అధికార పగ్గాలను అందుకునేందుకు అవసరమైన సంఖ్యా బలం సాధించడానికి కూతవేటు దూరంలోనే నిలిచిపోతుందని సర్వే పేర్కొంది. ఈ పరిస్థితుల్లో కింగ్ మేకర్ పాత్ర పోషించే జేడీఎస్ కీలకమౌతుందని సర్వే పేర్కొంది. ఔను రాష్ట్రంలో జరిగేది ముఖాముఖీ పోరే అయినా.. ఏవో కొన్ని స్థానాలను ఖాతాలో వేసుకోగలిగే పాటి బలం ఉన్న జేడీఎస్ ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీకే రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకునే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని పరిశీలకులు కూడా అంటున్నారు.
పైగా కర్నాటకకు హంగ్ కొత్త కాదు.. సంకీర్ణ ప్రభుత్వాలూ కొత్త కాదు. 2018 ఎన్నికల తర్వాత కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. 224 మంది సభ్యులున్న సభలో బీజేపీ 106 స్థానాల్లో విజయం సాధించి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కానీ మేజిక్ ఫిగర్ (113) చేరుకోలేక పోయింది. దీంతో 78 స్థానాలలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కేవలం 37 సీట్లు మాత్రమే గెలిచిన జేడీఎస్ ముఖ్యమంత్రి కుర్చీ పట్టుకు పోయింది. కుమార స్వామి ముఖ్యమంత్రిగా, జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కొలువు తీరింది. ఇప్పుడు రానున్న అసెంబ్లీ ఎన్నికలలో కూడా కర్నాటకలో అదే పరిస్థితి పునరావృతమౌతుందన్న భావన సర్వత్రా నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే జేడీఎస్.. తన పరిస్థితిని మరింత పటిష్టం చేసుకోవడానికి బీఆర్ఎస్ ను ఆశ్రయించిందని చెప్పవచ్చు.
కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రస్థానం దిశగా అడుగులు ప్రారంభించినప్పటి నుంచీ జేడీఎస్ నాయకుడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆయన వెన్నంటే ఉన్నారు. మధ్యలో కొంత దూరం పెరిగిందన్న వార్తలు వచ్చినా.. కర్నాటకలో జేడీఎస్ కోసం బీఆర్ఎస్ పని చేస్తుందని హరీష్ రావు ప్రకటనతో తేటతెల్లమైంది. అసెంబ్లీ ఎన్నికల వరకూ కర్నాటకలో బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండి జేడీఎస్ కు పూర్తి మద్దతు ప్రకటించడం ద్వారా ఆ తరువాత జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో జేడీఎస్ మద్దతుతో కొన్ని లోక్ సభ స్థానాలలో బీఆర్ఎస్ తన అభ్యర్థులను నిలిపి గెలిపించుకోవాలన్న వ్యూహంతో ముందుకు సాగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ వ్యూహం ఉభయ తారకమని జేడీఎస్ కూడా భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలలో జేడీఎస్ కు మద్దతు ఇచ్చి, అందుకు బదులుగా లోక్ సభ ఎన్నికలలో తాను పోటీ చేసే స్థానాలలో మద్దతు కోరడం ద్వారా బీఆర్ఎస్ కర్నాటకలో పాగా వేయాలని భావిస్తోందని చెబుతున్నారు. ఇక పోతే బీఆర్ఎస్ మద్దతు ద్వారా కర్నాటకలో చెప్పుకోదగ్గ అసెంబ్లీ స్దానాలలో విజయం సాధించడం ద్వారా మరో సారి సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహించే అవకాశాన్ని దక్కించుకోవాలని జేడీఎస్ భావిస్తోంది. అందుకు బీఆర్ఎస్ మద్దతే కాకుండా.. బీఆర్ఎస్ పథకాలు కూడా దోహదపడతాయని అనుకుంటోంది.