బొత్సది ఐరన్ లెగ్గా?



ఒక్కో రంగంలో ఒక్కో సీజన్లో ఒక్కొక్కరు జనం చేత ‘ఐరన్ లెగ్’ అని ముద్ర వేయించుకుంటారు.  తెలుగు రాజకీయ రంగంలో మొన్నామధ్య కాలంలో ఐరన్‌లెగ్‌గా ముద్ర వేయించుకున్న వ్యక్తి అప్పటి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ. ఆయన లెగ్గు పుణ్యమా అని అటు ఏపీలో, ఇటు తెలంగాణలో  కాంగ్రెస్ పార్టీ మటాషైపోయింది. స్వయంగా ఆయన కూడా తన నియోజకవర్గం చీపురుపల్లిలో జనం చేత చీపురు తిరగేయించుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన రాజకీయాల నుంచి తప్పుకుని శేష జీవితాన్ని తాను పెట్టుబడి పెట్టిన సినిమాలను చూసుకుంటూ గడిపేస్తే బావుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఏపీ రాజకీయాల్లో చిల్లు కాణీలాగా అయిపోయిన ఆయన్ని జగన్ ఏరి కోరి మరీ తన పార్టీలో చేర్చుకున్నారు. బొత్స రాకను అప్పటి వరకూ పార్టీకి సేవ చేసిన నాయకులు వ్యతిరేకించినా జగన్ వెనుకడుగువేయకుండా బొత్స చేత తన పార్టీలో అడుగు వేయించారు. ఇప్పుడు ఆ అడుగే జగన్ పార్టీకి ‘ఐరన్ లెగ్’ అయిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

బొత్స గారు ఏ నిమిషంలో వైసీపీలోకి అడుగుపెట్టారోగానీ, అప్పటికే ఏపీ జనం దృష్టిలో ఎక్కడో అడుగున వున్న ఆ పార్టీ ఇమేజ్ మరింత అట్టడుగుకు వెళ్ళిపోయింది. బొత్స గారి ఆగమనం తర్వాత జగన్ అనేక విచిత్రమైన నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్‌కి మద్దతు ఇవ్వడం అలాంటి ఘోరమైన తప్పిదం ఎవరైనా చేస్తారా? అలా చేసిన వారు ఏపీలో రాజకీయంగా బతికి బట్టకట్టే అవకాశం వుంటుందా? కానీ జగన్ మాత్రం ఆ నిర్ణయం తీసుకున్నారు. దీనికి వెనుక బొత్సగారి సలహా వుందని కూడా తెలుస్తోంది.  చివరికి ఏమైంది. ఏపీలో కొడిగడుతూ వున్న వైసీపీ దీపం టప్పుమని ఆరిపోయింది. ఏపీలో కొన్ని వర్గాల్లో వున్న జగన్ ఓటు  బ్యాంకు పూర్తిగా ఖాళీ అయిపోయింది. మరి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి  బొత్స గారి ‘లెగ్గు’ కూడా ఒక కారణమా అనే అనుమానాలు ఏపీలో వ్యక్తమవుతున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu