నొప్పి తగ్గిపోయేందుకు 7 చిట్కాలు...!

 

 

 

నొప్పి లేనిదే జీవితం లేదు. కాలిగోరు లేవడం దగ్గర నుంచీ, చెవిపోటు వరకూ నొప్పికి ఏదైనా కారణం కావచ్చు. భరించలేని నొప్పి కలిగినప్పుడూ, నొప్పితో పాటు జ్వరంలాంటి సమస్యలు ఉన్నప్పుడు వైద్యుని కలవాల్సిందే! కానీ నొప్పిని భరించక తప్పదని అనుకునే సమయాలలో కొన్ని చిట్కాలు పాటిస్తే ఉపయోగం ఉంటుందంటున్నారు.


ఊపిరి నిదానం - ఒంట్లో నొప్పిగా ఉన్నప్పుడు శ్వాసతో దానిని అదుపుచేసుకోవచ్చు. నిదానంగా, దీర్ఘంగా ఊపిరి పీల్చుకోవడం వల్ల మనసు తేలికబడుతుంది. శరీరానికి కూడా తగినంత ఆక్సిజన్‌ అందుతుంది. నొప్పి తగ్గడంలో ఈ రెండు చర్యలూ ఉపయోగపడేవే!

నీరు తాగండి - ఒంట్లో తగినంత నీరు లేకపోతే నానారకాల సమస్యలు ఎలాగూ వస్తాయి. అప్పటికే ఉన్న సమస్యలు కూడా మరింత చికాకుపెడతాయి. ముఖ్యంగా తలనొప్పి, కండరాల నొప్పులు వంటి ఇబ్బందులు ఉన్నప్పుడు నీరే ఔషధంలా పనిచేస్తుంది.

 

ఆకుకూరలు - ఆకుకూరలు తినడానికీ నొప్పి తగ్గడానికీ మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఆకుకూరలు, సోయాబీన్స్, చేపలు వంటి ఆహారంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి నొప్పి సత్వరం తగ్గడానికి ఉపయోగపడతాయి.

 

పసుపు – పసుపు ఒక నొప్పి మాత్రతో సమానమన్నది వైద్యుల మాట. పసుపులో ఉండే curcumin అనే రసాయనానికి ఒంట్లో వాపుని తగ్గించే సత్తా ఉందట. అందుకే టీలో కానీ, గోరువెచ్చటి నీటిలో కానీ చిటికెడు పసుపుని కలిపి పుచ్చుకుంటే నొప్పి, వాపులు తగ్గుతాయని సూచిస్తున్నారు. పైగా నొప్పి మాత్రలలాగా పసుపు లివర్‌, కిడ్నీలను దెబ్బతీయదు కూడా!

చేతులు కట్టుకోండి – వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఈ చిట్కా పనిచేస్తుందనే చెబుతున్నారు. వేళ్ల దగ్గర నుంచీ భుజాల వరకూ ఎక్కడన్నా నొప్పి ఉన్నప్పుడు... కాసేపు చేతులు కట్టుకొని కూర్చుంటే ఉపశమనం లభిస్తుందని అంటున్నారు.

 

మనసుని మళ్లించండి – శరీరంలో ఫలానా చోటు గాయపడిందని మెదడుకి సూచంచడమే నొప్పంటే! అందుకని మనసుని కాస్త మళ్లిస్తే నొప్పి మీద ధ్యాస కూడా తగ్గుతుంది. కళ్లు మూసుకుని ధ్యానం చేయడం, ప్రకృతిని ఊహించుకోవడం, సంగీతం వినడం.... లాంటి సవాలక్ష చిట్కాలతో మనసుని మళ్లించవచ్చు.

 

విశ్రాంతిగా ఉండండి – విశ్రాంతి తీసుకుంటే నొప్పి సగానికి సగం తగ్గిపోతుంది. శరీరం సుఖంగా, అనువుగా ఉండే భంగిమలో కాసేపు విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేయండి. ఎలాంటి వెలుతురూ, శబ్దాలూ లేని ప్రదేశంలో విశ్రమించండి.

 

వీటితో పాటుగా వేడినీటితో స్నానం చేయడం, నొప్పి ఉన్న చోట కాస్త కాపడం పెట్టడం లాంటి సవాలక్ష ఉపాయాలు ఉండనే ఉన్నాయి.


- నిర్జర.