బొబ్బిలి వీణకు కలప కొరత

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బొబ్బిలి వీణలకు సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ వీణల తయారీకి ఉపయోగించే పనస కలప తగినంతగా లభ్యంకావడం లేదు. దీనితో వీణల తయారీ సంఖ్య గణనీయంగా పడిపోయింది. స్థానికంగా పనస కలప లభ్యంకాకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి ఈ కలపను దిగుమతి చేసుకుని వీణలను తయారుచేయాల్సి వస్తోంది. కలపను దిగుమతి చేసుకోవడంవాళ్ల వీణల తయారీ ఖర్చు దాదాపు 20 శాతం పెరిగింది. ఫలితంగా వీణల ధరలు కూడా ఆకాశాన్నంటాయి. ధరలు పెరగడంతో వీణలకు డిమాండ్ తగ్గుతుందని వ్యాపారులు అంటున్నారు. వీణల తయారీదారులు కూడా కలప కొరత కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్నారు. పనస కర్రను ప్రభుత్వమే సరఫరా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించకపోతే బొబ్బిలి వీణలు మూగబోవడం ఖాయమని స్థానికులు అంటున్నారు.