నల్ల చొక్కాలు.. చేతులకు బేడీలు!

రైతులకు బేడీలు వేసిన అంశంపై టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చర్చకు పట్టు పట్టడం తో సోమవారం(డిసెంబర్ 16) తెలంగాణ అసెంబ్లీ అట్టుడికిపోయింది. ఇదే అంశంపై తెలంగాణ అసెంబ్లీ లో మంగళవారం (డిసెంబర్ 17) బీఆర్ఎస్ సభ్యులు వినూత్న నిరసన చేపట్టారు. నల్ల చొక్కాలు ధరించి, చేతులకు బేడీలు వేసుకుని సభకు   వచ్చారు.  లగచర్ల రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీలో నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావు,సహా ఎమ్మెల్యే లంతా నల్ల చొక్కాలు ధరించి, చేతులకు బేడీలు వేసుకుని అసెంబ్లీకి వచ్చారు.  ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం.. లాఠీ రాజ్యం లూటీ రాజ్యం.. రైతులకు బేడీలా సిగ్గు సిగ్గు.. అంటూ నినాదాలు చేస్తూ సభలో ఆందోళనకు దిగారు.

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా జరుగుతున్నాయి. సోమవారం అసెంబ్లీలో  అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. రోజంతా వాయిదాలు, వాకౌట్ల పర్వం నడిచింది. శాసనసభలో ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం' అని ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ సభ్యులు నినాదాలు చేస్తే అందుకు ప్రతిగా..  ఇది ప్రజాప్రభుత్వం అంటూ అధికారపక్ష కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు.  లగచర్ల రైతుల అంశంపై చర్చ జరపాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టగా స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ దాన్ని తోసిపుచ్చారు. మంగళవారం (డిసెంబర్ 17) కూడా దాదాపు అవే సీన్లు రిపీట్ అయ్యాయి.