రాహుల్ భారతీయుడే కాదు.. లేఖ కూడా రాశా.. సుబ్రమణ్య స్వామి

 

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై ప్రస్తుతం రగడ జరుగుతుంది. ఈయన పౌరసత్వంపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత డాక్టర్ సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ భారతీయుడు కాదని.. అతను ఇంగ్లండ్ పౌరసత్వం ఉన్న వ్యక్తని అన్నారు. అంతేకాదు 2003ఆగస్టు 21లో రాహుల్‌ యూకేలో బ్యాకప్స్‌ లిమిటెడ్‌ పేరుతో కంపెనీ ప్రారంభించాడని.. అది అక్కడి లండన్ చిరునామాతోనేనని.. కంపెనీకి కార్యదర్శిగా, డైరెక్టర్‌గా కొంతకాలం ఆయనే వ్యవహరించగా తరువాత 2009 ఫిబ్రవరి 17న కంపెనీని మూసేశారని తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఓ లేఖ కూడా రాసినట్టు ఆయన సోమవారం ఢిల్లీలో వెల్లడించారు. కాగా భారత్ లో ద్వంద్వ పౌరసత్వ విధానం లేనందున కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మొత్తానికి ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసే సుబ్రహ్మణ్య స్వామి ఈసారి రాహుల్ ను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.