వైనాట్ 175 నినాదమెక్కడ? జగన్ కి బొమ్మ కనబడిందా?

రాజకీయాలలో ఒక్కో పార్టీకి ఒక్కో స్టైల్ ఉంటుంది. ఏపీలో వైసీపీకి ఓ స్టైల్ ఉంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నా పార్టీ అధిష్టానం ఒక నినాదాన్ని ప్రకటించి.. ప్రజల చెవులలో మారుమ్రోగేలా కార్యకర్తల చేత ఆ నినాదాన్ని ఊదించడం వైసీపీ స్టైల్. గత ఎన్నికలలో టీడీపీ రాజధాని నిర్మాణాన్ని గ్రాఫిక్స్ అనడం నుండి ఒక్క ఛాన్స్ ప్లీజ్ వరకూ వైసీపీ చాలానే గిమ్మిక్కులు, మ్యాజిక్కులు చేసింది. ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసాక ఈ నాలుగేళ్ళలో కూడా వైసీపీ అలాంటి  కొన్ని నినాదాలను బలంగా ప్రజలలోకి పంపేందుకు ప్రయత్నించింది. ఆ క్రమంలోనే ఆ మధ్య వైసీపీ నుండి వై నాట్ 175 అనే నినాదం  బయటకొచ్చింది. సీఎం జగన్మోహన్ రెడ్డి నుండి మంత్రులు, ఎమ్మెల్యేల వరకూ అందరూ వై నాట్ 175 అంటూ మీడియా మైకుల ముందు ఊదరగొట్టేసే వారు. 

అయితే, ఇప్పుడు ఆ నినాదం మరుగున పడింది. ఈ మధ్య కాలంలో వై నాట్ 175 నినాదం వైసీపీ నేతల నోటి నుండి రావడం లేదు.  దీంతో వైసీపీకి తత్వం బోధ పడిందా? అందుకే వై నాట్ 175 నినాదాన్ని పక్కన పెట్టేశారా? అసలు ఈ నినాదం వైసీపీ ఎందుకు వదులుకుంది అనే చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతుంది. నిజానికి వైసీపీ నినాదం అయితే వదిలింది కానీ అది సాధ్యమయ్యే పని కాదు. గత ఎన్నికలలో 151 రావడం వెనక సవాలక్ష కారణాలు ఉన్నాయి. వైసీపీ అందుకున్న ఒక్క ఛాన్స్ ప్లీజ్ నుండి అమరావతి మీద ఆరోపణలు చేయడం, మేధావులుగా పిలవబడే కొందరు నిత్యం మైకుల ముందు టీడీపీ ప్రభుత్వంపై బురద జల్లడం, వివేకా హత్యకేసు, కోడికత్తి కేసు సానుభూతి, ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ టీం ప్రణాళికలు, జగన్ పాదయాత్ర ఇలా చాలా రకాలుగా కలిసి వస్తేనే వైసీపీకి 151 సీట్లు గెలుచుకున్నారు. 

కానీ, ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీకి ఆ పరిస్థితి ఉందా అంటే లేదనే బలంగా వినిపిస్తుంది. సీఎం సొంత ప్రాంతం రాయలసీమలోనే ఈసారి జగన్మోహన్ రెడ్డి పప్పులు ఉండకడం కష్టమే అంటున్నారు. క్లీన్ స్వీప్ చేసిన నెల్లూరు జిల్లాలో సగానికి సగం మంది రెబల్స్ అయ్యారు. అటు వైపు చిత్తూరు జిల్లాలో మంత్రి రోజా లాంటి వారికే ఎదురుగాలి వీస్తుంది. ఇటు గుంటూరు లాంటి జిల్లాలో పార్టీ నేతల మధ్య అంతర్గత కుమ్ములాట ప్రజలలో చులకన చేసింది. మరోవైపు ముక్కలైన వైఎస్ కుటుంబం, బాబాయ్ వివేకా హత్య కేసులో అబ్బాయిలే నేరస్తుల్ని సీబీఐ స్టేట్మెంట్లు ఇవ్వడం, కోడికత్తి శీను జైల్లోనే నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించడం ఇలా అన్నీ ప్రజలే చూస్తున్నారు. మరోవైపు వైసీపీ సృష్టించిన అరాచకాలు, నేతలు చేసిన దందాలు, కక్ష్యపూరిత రాజకీయాలు, ఇసుక కోసం పడిన పాట్లు, చెత్తకు కడుతున్న ట్యాక్సులు ఇలాంటివి కూడా ప్రజలు అంత సులభంగా మర్చిపోయేవి కాదు. 

ఇవన్నీ కలిసే ప్రజలలో ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకత పెరిగింది. నాడు వైపీపీ విజయానికి ఏ అంశాలైతే దోహదపడ్డాయో అవి ఇప్పుడు వైసీపీకి గుదిబండలుగా మారి ఓటమి భయాన్ని కలిగిస్తున్నాయి. గడపగడపకి కార్యక్రమంలో ఈ వ్యతిరేకతే వైసీపీ నేతలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేలు అని కూడా చూడకుండా ప్రజలు మీరేం చేసారని పలు చోట్ల నిలదీశారు. దీంతో కొంత మంది గడపగడపకు కు డుమ్మా  కొట్టేశారు. ఆ వ్యతిరేకత చూసిన తర్వాత వైసీపీ వై నాట్ 175 నినాదాన్ని పక్కన పెట్టినట్లుగా కనిపిస్తుంది.

ఇలాంటి నినాదాలు ఇచ్చి ఆ తర్వాత కొత్త ఇబ్బందులు తెచ్చుకోవ‌డం ఎందుక‌నే కొంద‌రు సీనియ‌ర్ల అభిప్రాయంతోనే ఈ నినాదం మాయమైనట్లు కనిపిస్తుంది. అందుకే నాలుగు నెలల ముందు ఇచ్చిన వై నాట్ 175 నినాదం ఇప్పుడు   సీఎం సహా వైసీపీ నాయకుల నోటి వెంట రావడం లేదు. సీఎం జ‌గ‌న్ ఎక్క‌డ ఏ వేదిక ఎక్కినా.. కొన్నాళ్ల కింద‌ట వైనాట్ 175 అనేవారు. కానీ, ఇటీవ‌ల కాలంలో ఆయ‌న పాల్గొనే స‌భ‌ల్లో  ఆయన నోట  వైసీపీని గెలిపించండి అన్న అభ్యర్థన మాత్రమే వినిపిస్తోంది. వై నాట్ 175 మాట దేవుడెరుగు అత్తెసరుగానైనా సరే అధికారాన్ని నిలబెట్టుకుంటే అదే పదివేలన్న బేలతనం కనిపిస్తోంది.