యాంటీ జగన్.. బీజేపీ కొత్త స్టాండ్ స్ట్రాటజీ ఏంటి?

ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ వ్యూహం మార్చిందా? పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనతో పొత్తు విషయంలో సందిగ్ధం కొనసాగుతున్న నేపధ్యంలో, ఒంటరి పోరాటానికి సిద్డంవుతోందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. నిజానికి  ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీకి ఉన్నదీ లేదు పోయేదీ లేదు. ఆ మాటకొస్తే ఒక్క బీజేపీ మాత్రమే కాదు, కాంగ్రెస్ సహా ఏ జాతీయ పార్టీకీ ఆంధ్ర ప్రదేశ్ లో పట్టుమని పదిశాతం ఓట్లు వచ్చే పరిస్థితి లేదు. 2019 ఎన్నికల్లోనే అది తేలిపోయింది.

తెలుగు దేశం, వైసీపీ, జనసేన ఈమూడు పార్టీలే రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాయనే విషయంలో స్పష్టత వచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ  అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో టీడీపీ, వైసీపీలకు సమాన దూరం పాటించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.అలాగే  అందులో భాగంగానే రాష్ట్రంలో అధికారంలో ఉన్న, వైసీపీతో అంటకాగుతోందనే మచ్చను తుడిచేసుకునేందుకు బీజేపీ నాయకులు జగన్ సర్కార్ టార్గెట్ గా  పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. 

ముఖ్యంగా ముఖ్యమంత్రి సొంత బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వెలుగు చూస్తున్న వాస్తవాలు కమల నాథులను కలవరపాటుకు గురిచేస్తున్నాయని అంటున్నారు. ఇంతకాలం ఈ కేసులో, కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి అండగా నిలిచిందనే ముద్ర పడిపోయింది. ఈ అపవాదును తుడిచేసుకునేందుకు బీజేపే నేతలు, సీబీఐ పై వైసీపీ  నాయకులు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నారు. ఇందులో భాగంగానే కావచ్చును బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్  తప్పు ఎవరు చేసినా జైలు శిక్ష అనుభవించక తప్పదని.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అదే జరుగుతోందన్నారు  జగన్ తప్పు చేసి ఉంటే జైలుకు వెళ్లక తప్పదన్నారు. వివేక హత్య కేసులో సీబీఐ అధికారులు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారన్న ఆయన వైసీపీ నేతలు సీబీఐని నిందించడం సరైంది కాదన్నారు. ఆధారాలున్నాయి కాబట్టే నిందితులను  అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు. ఫ్యాక్షన్ ప్రభుత్వంగా పేరు సంపాదించుకున్న వైసీపీతో బీజేపీ కలిసిందన్న ప్రచారంలో ఇసుమంతైనా వాస్తవం లేదని చెప్పు కొచ్చారు. 

అంతే కాదు పనిలో పనిగా  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వమని దుయ్యబట్టారు. నిజానికి గడచిన నాలుగేళ్ళలో ఎప్పుడూ లేని  విధంగా జగన్ రెడ్డి ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వం అనే అర్థం వచ్చేలా సునీల్ దియోధర్ ఘాటైన విమర్శలు చేశారు. జగన్ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు,  ఏడుకొండలవాడితో పెట్టుకున్న వారెవరూ చరిత్రలో బాగుపడలేదని సునీల్ దియోధర్ శాపనార్థాలు పెట్టారు.

జగన్ రెడ్డి ప్రభుత్వం పంథా  మార్చుకోక పోతే  వచ్చే  ఎన్నికల తర్వాత ఏపీలో వైసీపీ ఉండదని వ్యాఖ్యానించారు. టీటీడీలో అన్యమతస్తులను జగన్ ప్రోత్సహిస్తున్నారని.. కొత్త ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇస్తున్నారని,   కొన్ని రోజుల ముందు  టీటీడీ ఇచ్చిన  నోటిఫికేషన్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో  నోటిఫికేషన్ ను వెనక్కి తీసుకోకుంటే బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఆందోళనలు చేస్తామని  హెచ్చరించారు.

నిజానికి టీటీడీ నిర్వహించే ఆసుపత్రులలో ముస్లింలకు, క్రైస్తవులకు రిజర్వేషన్ కల్పిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్ విషయంలో బీజేపీ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఇది కేవలం మచ్చ తుడుచుకునేందుకా లేక అంతో ఇంతో మిగిలిఉన్న హిందూ ఓటును కాపాడుకునేందుకా ? అనేది ముందు ముందు తెలుస్తుందని పరిశీలకులు అంటున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu