సింగరేణి దుస్థితికి కారణాలెన్నో...
posted on Apr 20, 2023 12:24PM
తెలంగాణకు తలమానికంగా నిలిచిన సింగరేణి అప్పుల ఊబిలో చిక్కుకుపోయింది. రూ 10 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన ఈ సంస్థ ఒకప్పుడు రూ 3,500 కోట్ల మిగులు సాధించింది. తెలంగాణ
ప్రభుత్వం 51 శాతం బిజేపీ ప్రభుత్వం 49 శాతం ఉన్న సింగరేణి కాలరీస్ ఈ దుస్థితికి గల కారణాలు ఏమిటి అని లోతుగా ఆరా తీస్తే అసలు విషయాలు బయటకొస్తాయి. సింగరేణి కంటే పెద్దదైన కోల్ ఇండియా లిమిటెడ్ కు కేవలం రూ 12 వేల కోట్ల రూపాయల అప్పులుంటే సింగరేణి ఇంత పెద్ద మొత్తంలో అప్పుల పాలు కావడానికి ఎవరిని నిందించాలి? కార్మికులకు విపరీతంగా వేతనాలు ఇచ్చేయడం వల్లే సింగరేణి నష్టాల్లో కూరుకుపోయిందని అనడానికి వీల్లేదు. సింగరేణి కార్మికుడికి రూ 420 ఇస్తే కోల్ మైన్ ఇండియా కార్మికుడికి రూ 930 అందుతుంది. తెలంగాణ ఏర్పాటుకు ముందు సింగరేణి బంగారు గనిలా బాసిల్లింది.
సింగరేణిలో గుట్టు చప్పుడు కాకుండా ప్రయివేటీకరణ దిశగా అడుగులు వేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ నేతల, కేసీఆర్ కుటుంబ సభ్యుల జోక్యం విపరీతంగా పెరిగిపోయిందని ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నాయి. సింగరేణిలో రోజురోజుకు టర్నోవర్ పెరుగుతుంటే లాభాలు వచ్చే బదులు నష్టాలు ఎక్కువగా వస్తున్నాయి. కార్మికులకు, ఉద్యోగులకు అప్పులు చేసి వేతనాలివ్వడం పలువురిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఉట్టి కెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు విశాఖ స్టీల్ ప్లాంట్ బీఆర్ఎస్ నేతలు ఉద్దరిస్తామనడం విడ్డూరంగా ఉంది అని బుధవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నిలదీశారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో కల్వకుంట్ల ఫ్యామిలీ పెట్టుబడులు పెడతామనడం ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను మోసగించడమేనని ఆయన అన్నారు.
సింగరేణి కాలరీస్ కార్మికులకు ఇళ్లు కట్టిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ నీరుగారిపోయింది. కనీసం ఇంటి కిరాయిలు కట్టుకోలేకపోతున్నామని సింగరేణి కార్మికులు గగ్గోలు పెడుతున్నారు. సింగరేణి కాలరీస్ కు రాష్ట్ర ప్రభుత్వం రూ 25 వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. టిఎస్ జెన్ కో రూ 2,500 కోట్లు, ట్రాన్ కో రూ 18 వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయని బీజేపీ ఆరోపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించిన సింగరేణిని లాభాల బాటలో తీసుకెళ్లినప్పుడు మాత్రమే తెలంగాణ బంగారు గనిగా పూర్వ వైభవం తెచ్చుకుంటుంది. రాజకీయాలకతీతంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాల్సి ఉంది.