బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు: జగన్

కడప: భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం కడప జిల్లా రోడ్ షోలోస్పష్టం చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నామని కాంగ్రెస్ దుష్ర్పచారం చేస్తూ నీచ రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. తన తల్లి విజయమ్మను, తనను ఓడించడానికి కాంగ్రెసు నీతిమాలిన చర్యలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. ఉప ఎన్నికలలో తమను ఎదుర్కొనలేక అసత్య ఆరోపణలు గుప్పిస్తుందని అన్నారు. కడప జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీకి చెందిన 7వేల మంది కార్యకర్తలపై బైండోవర్ కేసులు పెట్టి వేధిస్తుందని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి, తన తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఫొటో పెట్టుకుంటూనే మరోవైపు పులివెందులలో తన తల్లిపై బాబాయి వివేకానందరెడ్డిని పోటీకి దింపడం కాంగ్రెసు దిగజారుడుతనానికి నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో వస్తున్న అందరి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా కొందరిపైనే చర్యలు తీసుకోవడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తనతో వస్తున్న అందరు ఎమ్మెల్యేలపై ఒకేసారి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu