పోలీసుల నియంత్రణలోకి పుట్టపర్తి

పుట్టపర్తి : పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంతోపాటు సత్యసాయిబాబా చికిత్స పొందుతున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాలను పోలీసులు తమ నియంత్రణలోకి తీసుకున్నారు. హెలిప్యాడ్‌లను సిద్ధం చేస్తున్నారు. బందోబస్తు కోసం జిల్లావ్యాప్తంగా పోలీసులే కాకుండా కర్నూలు, చిత్తూరు, గుంటూరు ప్రాంతాలకు చెందిన పోలీసులు కూడా తరలివచ్చారు. పుట్టపర్తిలో ఏర్పాటు చేయడానికి బిగ్ స్క్రీన్లు తెప్పించారు. వాటి ఏర్పాట్లలో సిబ్బంది తలమునకలయ్యారు. కట్టుదిట్టంగా బ్యారికేడ్లను నిర్మిస్తున్నారు. కర్నూలు నుంచి పోలీసు బ్యాండ్ పార్టీ చేరుకుంది. జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తం కావడమే కాకుండా.. సెలవులు ఉండవని కూడా ఆదేశాలు జారీ చేశారు. పుట్టపర్తిలో శుక్రవారం పరిస్థితి ఇది. దీంతో, ఉత్కంఠ వాతావరణం నెలకొంది. పోలీసుల హడావిడి, అధికార యంత్రాంగం మల్ల్లగుల్లాలు, ట్రస్ట్ సభ్యుల సమావేశాలు.. తదితర వ్యవహారాలు భక్తులను ఆందోళనలో పడేశాయి.

పుట్టపర్తిలోని ఏర్పాట్లను మంత్రి గీతారెడ్డి, కలెక్టర్ జనార్దన్‌రెడ్డి, ఐజీ సంతోష్ మెహ్రా, డీఐజీ చారుసిన్హా, ఎస్పీ షానవాజ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్త్తున్నారు. ఒకవైపు పోలీసుల హడావిడి కొనసాగుతుండగానే.. మంత్రి గీతారెడ్డి, ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యే పల్లె రఘునాథ్‌రెడ్డి, ఐజీ సంతోష్ మెహ్రా, డీఐజీ చారుసిన్హా, కలెక్టర్ జనార్దన్ రెడ్డి, ఎస్పీ షానవాజ్ ఖాసీంలతో ట్రస్ట్ వర్గాలు సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నాయి. ఏదైనా కీలక ప్రకటన చేయాల్సి వస్తే చేపట్టబోయే ఏర్పాట్లపై కూడా వారు సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు అందాయి. ఒక్క పోలీసు శాఖలోనే కాకుండా ఎంపీడీవోలు, తహసీల్దార్‌లతోపాటు ఇతర శాఖలకు చెందిన ముఖ్య అధికారులందరినీ ఎప్పుడు పిలిచినా పుట్టపర్తికి వచ్చేలా హెడ్ క్వార్టర్లలో సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో, పుట్టపర్తిలో విషాద వాతావరణం నెలకొంది. అయితే, బాబా ఆరోగ్యం విషమంగా ఉండడంతో ఆయనను చూడడానికి వీవీఐపీలు వస్తే అప్పటికప్పుడు బందోబస్తు చేపట్టడం కష్టమని. దీనిని దృష్టిలో పెట్టుకునే ముందస్తుగా బందోబస్తు చర్యలు చేపట్టామని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu