పాదాల పగుళ్లను తగ్గించే చిట్కాలు
posted on Jul 15, 2024 9:30AM
చలికాలంలో పాదాల పగుళ్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. పొడి గాలి, తేమ సరిగా లేకపోవడం, పాదాలకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పాదాల పగుళ్లు వస్తుంటాయి. ఆహార లోపాలు, పెరుగుతున్న వయసుతోపాటు ఎక్కువ సేపు గట్టి నేల మీద నిలబడి ఉండాల్సి రావడం కూడా మడమల పగుళ్లకు దారి తీస్తుంటాయి. డయాబెటిస్‌తోపాటు థైరాయిడ్ సమస్యలు కూడా పాదాల పగుళ్లను మరింత పెంచుతాయి. కొద్దిపాటి జాగ్రత్తతో పగిలిన పాదాలను ఇంట్లోనే మృదువుగా మార్చేసుకోవచ్చు
* రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు సబ్బు నీటితో పాదాలను కడిగేసుకోవాలి. మృత చర్మం తొలగిపోయేలా రుద్దాలి. తర్వాత పొడి వస్త్రంతో తుడిచేసి.. పాదాలకు వెజిటబుల్ ఆయిల్స్‌ను రాయాలి. సాక్సులు ధరించి నిద్రించాలి. ఉదయాన్నే పాదాలు మృదువుగా ఉండటాన్ని గమనించొచ్చు. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల పగుళ్లు పూర్తిగా తగ్గిపోతాయి.
* చర్మం రఫ్‌గా మారడం పగుళ్లకు దారి తీస్తుంది. నిమ్మలోని ఆమ్ల గుణాలు రఫ్‌గా మారిన చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. వెచ్చటి నీటిలో నిమ్మరసం కలిపి పాదాలను పావు గంటపాటు అందులో ఉంచాలి. తర్వాత మడమల్ని రుద్దేసి.. కడిగేశాక.. పొడిగా ఉండే వస్త్రంతో తుడవాలి. నిమ్మ చెక్కని పగుళ్ళకి రుద్దడం వలన కూడా పగుళ్లు తగ్గుతాయి .
* పాదాల పగుళ్లు వచ్చిన వారు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో చెంచా ఉప్పు, చిటికెడు పసుపు వేసి ఆ నీటిలో పాదాలను పది నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత పొడి వస్త్రంతో శుభ్రంగా తుడిచి పెట్రోలియం జెల్లీని రాసుకుంటే పగుళ్లు తగ్గుతాయి.
* గ్లిజరిన్, రోజ్ వాటర్ మిశ్రమంతోనూ మడమల పగుళ్లను తొలగించొచ్చు. ఈ రెండింటిని సమపాళ్లలో కలిపి రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు మడమలు, పాదాలకు రాయాలి. రోజూ ఇలా చేయడం వల్ల పగుళ్లు తగ్గిపోతాయి.