అఖిలేష్ యాదవ్ డైరెక్షన్ లో తెలంగాణలో మరో కొత్త పార్టీ? 

రాజన్న సంక్షేమ రాజ్యం కోసం, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిలమ్మ, వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు. మతాన్ని, కులాన్ని కలబోసి ఒక వర్గం ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరో వంక ఇటీవలనే స్వచ్చంద పదవీ విరమణ చేసిన  ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ రేపో మాపో  అధికారికంగా రాజకీయ అరంగేట్రం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. దళిత జనుల ఉద్దరణ కోసం ఆరేళ్ళ సర్వీస్ వదులుకుని వచ్చిన ఆయన ఆగష్టు 7 వతేదీన మాయావతి బాటలో కాన్షీరామ్’ స్థాపించిన బీఎస్పీలో చేరుతున్నారు. బీఎస్పీలో చేరుతున్నారు అంటే కంటే, ఆయన తమ ఆలోచనలకు ఆచరణ రూపం ఇచ్చేందుకు బీఎస్పీని వేదిక చేసుకుంటున్నారు. ఇక్కడ దళిత జనుల ఉద్దరణ ఆయన ప్రధాన ఎజెండాగా ఉంటుందని వేరే చెప్పనక్కరలేదు.

ఇప్పుడు అదే వరసలో అదే యూపీ నేతల ప్రోత్సాహంతో, తెలుగు రాష్ట్రాలలో మరో కొత్త పార్టీ పుట్టుకొస్తోంది.అవును,సమాజ్ వాదీ పార్టీ, (ఎస్పీ) అధినేత, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తెలుగు రాష్ట్రాలలో బీసీల పార్టీ ఏర్పాటు చేస్తే, తమ పార్టీ మద్దతు ఇస్తుందని, తెలుగు రాష్ట్రాలలో బీసీ సంఘాల నాయకుదు, మాజీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్యకు హామీ ఇచ్చారు. నిజానికి బీసీ పార్టీ పెట్టమని ఆయనే ఈయన్ని గిల్లి వదిలి పెట్టారు. జాతీయ రాజకీయాల్లో వేగంగా చోటు చేసుకుంటున్న మార్పుల నేపధ్యంలో అఖిలేష్ యాదవ్  చేసిన సూచన ప్రాధాన్యత సంతరించుకుందని అంటున్నారు. 

ఇక విషయంలోకి వెళితే ఆర్‌.కృష్ణయ్య, బీసీ సంఘం నేత గుజ్జ కృష్ణ ఢిల్లీలో గురువారం అఖిలేష్ యాదవ్ ను  కలిశారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టడానికి చొరవ తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా, అఖిలేష్ యాదవ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో బీసీ వాదం బలంగా ఉందని, ఈ  నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో  బీసీల పార్టీ పెట్టాలని సూచించారు.ఈ విషయాన్ని ఆర్. కృష్ణయ్య స్వయంగా చెప్పారు. అయితే, బీసీల పార్టీ పెడతారా లేదా అన్న విషయంలో మాత్రం ఆయన ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేదు. 

గతంలో కొందరు నేతలు చేసిన ప్రయత్నాలు ఫలిచలేదు. ఇక ముందు ఏమి జరుగుతుందనేది ముందే తెలుస్తుంది. అయితే, తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలలో కులాల ప్రభావం పెరుగుతోందా అంటే మాత్రం అవుననే అనవలసి వస్తోంది. ముఖ్యంగా హుజురాబాద్ ఉప ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు, కుల రాజకీయాలను తట్టి లేపుతోందని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.