ఐటీ కంపెనీలతో తెలంగాణ సర్కార్ వార్? ఉద్యోగుల్లో కలవరం.. 

ఐటీ అనగానే దేశంలో బెంగళూరు తర్వాత వినిపించే పేరు హైదరాబాదే. గత కొన్నేండ్లుగా హైదరాబాద్ లో ఐటీ మరింత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఐటీ ఎగుమతుల్లోనూ ఏడాదికేడాది రికార్డులు సాధిస్తోంది. కరోనా కల్లోల సమయంలోనూ హైదరాబాద్ ఐటీ వృద్ధి అశాజనకంగానే ఉంది. తమ ప్రభుత్వ విధానాలు, పాలసీల వల్లే ఐటీ రంగం దినదినాభివృద్ధి చెందుతోందని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఐటీ మంత్రి కేటీఆర్ ప్రయత్నాల వల్లే ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీలన్ని హైదరాబాద్ వస్తున్నాయని గులాబీ లీడర్లు, కార్యకర్తలు ప్రచారం చేసుకుంటున్నారు. ఇదంతా ఒకవైపు అయితే ప్రస్తుతం మాత్రం సీన్ మారినట్లు కనిపిస్తోంది. ఐటీ కంపెనీలతో తెలంగాణ సర్కార్ కు మధ్య ప్రస్తుతం వార్ జరుగుతోందని తెలుస్తోంది. తమపై తెలంగాణ  ప్రభుత్వం ఒత్తిడి తెస్తుందని ఐటీ సంస్థల ప్రతినిధులు ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు. 

కరోనా కారణంగా ఐటీ కంపెనీలన్ని మూత పడ్డాయి. ఉద్యోగులతో అవి వర్క్ ఫ్రమ్ హోం చేపిస్తున్నాయి. ముందుగా కొన్నినెలల వరకే వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకున్నా... అది పొడిగిస్తూ పోతూనే ఉన్నాయి. గత మార్చి నుంచి ఐటీ ఉద్యోగులంతా వర్క్ ఫ్రమ్ హోంలోనే ఉన్నారు. అయితే తాజాగా తెలంగాణ సర్కార్.. వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో ఐటి కంపెనీలపై ఒత్తిడి తెస్తుందట. వర్క్ ఫ్రం హోం పద్దతికి స్వస్తి చెప్పి ఉద్యోగులను సంస్ధలకు పిలిపించాలని ఐటి సెక్రటరీ జయేష్ రంజన్ తో ప్రభుత్వం చెప్పించిందని తెలుస్తోంది ఇప్పటికే చాలాకాలంగా ఉద్యోగులు తమ ఉద్యోగాలను ఇళ్ళనుండే చేస్తున్నారని ఈ పద్దతికి ఫుల్ స్టాప్ పెట్టి అందరినీ ఆఫీసులకు పిలిపించాలని జయేష్ ఐటి సంస్ధల మేనేజర్లతో జరిగిన సమావేశంలో గట్టిగానే చెప్పారట. 

తెలంగాణ సర్కార్ నిర్ణయాన్ని  ప్రముఖ కంపెనీలు వ్యతిరేకించాయని తెలుస్తోంది. తమ యాజమాన్యాల నిర్ణయం ప్రకారమే ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు కాబట్టి ఇప్పటికిప్పుడు అందరినీ ఆఫీసులకు పిలిపించటం సాధ్యంకాదని తెగేసి చెప్పాయట. గూగుల్, కాగ్నిజెంట్ , విప్రో , ఫేస్ బుక్,  డెలాయిట్ ఇన్ఫోసిస్ లాంటి కంపెనీల యాజమాన్యాలన్నీ తమ ఉద్యోగులంతా వచ్చే అక్టోబర్ వరకు ఇళ్ళనుండే పనిచేయాలని గతంలోనే నిర్ణయించాయి. ఈ విషయాన్ని సంస్ధల ప్రతినిధులు జయేష్ కు చెప్పారట. పెద్ద కంపెనీల బాటలోనే చిన్నతరహా  ఐటీ కంపెనీలు కూడా ఫాలో అవుతాయని వివరించారట. పైగా ఉద్యోగులు ఇళ్ళల్లో ఉండి పనిచేసినా ఆఫీసులకు వచ్చి పనిచేసినా అవుట్ పుట్ ఒకేలా ఉందని వివరించారు. కాబట్టి ఐటి ఉద్యోగుల పని విషయంలో ఇప్పటికప్పుడు తాము నిర్ణయం తీసుకోవటం కష్టమని కూడా తెగేసిచెప్పారు. 

ఐటీ కంపెనీలపై తెలంగాణ సర్కార్ ఒత్తిడి తేవడానికి బలమైన కారణాలు కనిపిస్తుండగా... ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ అఫీసుకు విముఖత చూపడానికి వాళ్లకు బలమైన కారణాలే ఉన్నాయి. ప్రభుత్వం గట్టిగా వ్యవహరించడానికి కారణం ఉపాధి కల్పనే. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 15 వందల ఐటీ కంపెనీలు ఉండగా... దాదాపు 6 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. ఈ ఐటీ కంపెనీలపై ఆధారపడి మరో 15 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని అంచనా. క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లు, ఆటో వాలాలు.. టిఫిన్ సెంటర్లు, సెక్యూరిటీ గార్డ్స్, స్వీపర్స్, చిన్న చిన్న ఉద్యోగులు, గార్డెన్ వర్కర్లు... ఇలా దాదాపు 15 లక్షల మంది ఐటీ కంపెవీల్లో పని చేస్తూ జీవనం సాగించే వారు. ఇప్పుడు ఐటీ కంపెనీలన్ని మూతపడి ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేస్తుండటంతో... చిన్న చితకా పనులు చేసే 15 లక్షల మంది రోడ్డున పడ్డారు. వీళ్లందరికి ఉపాధి చూపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే పడింది. ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిపోతోంది. అందుకనే ఐటి కంపెనీల ప్రతినిధులపై ఒత్తిడి తెస్తోందని ఐటీ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు ఐటీ కంపెనీల వాదన మాత్రం మరోలా ఉంది. కొవిడ్ ఇంకా పూర్తిగా నియంత్రణలోకి రాకపోవడం, థర్డ్ వేవ్ వస్తుందన్న భయాలతో తాము ఆఫీసులు తెరవడానికి ముందుకు రావడం లేదని ఐటీ కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. ఉద్యోగులను రిస్కులో పడేయలేమని అంటున్నారు. కారణాలు ఇవి చెబుతున్నా ఐటీ కంపెనీలు ఆలోచన మరోకటి కూడా ఉందంటున్నారు. ఉద్యోగుల వర్క్ ఫ్రం హోం వల్ల కంపెనీల యాజమాన్యాలకు చాలా ఖర్చులు మిగులుతున్నాయట. ఆఫీసు నిర్వహణ ఉద్యోగుల ట్రాన్స్ పోర్టు, కరెంట్ ఏసీ బిల్లులు, చిన్న చిన్న ఉద్యోగుల వేతనాలు అన్ని మిగులుతున్నాయట. అంతేకాదు వర్క్ ఫ్రమ్ హోంలోనూ జరగాల్సిన ప్రాజెక్టు వర్కులన్ని టార్గెట్ మేరకే జరుగుతున్నాయట. దీంతో ఆఫీసులు ఓపెన్ చేయడం కల్లా ఇదే ప్రాఫిట్ గా ఉందన్న ఆలోచనకు వచ్చిన ఐటీ కంపెనీలు.. వర్క్ ఫ్రమ్ హోంను కంటిన్యూ చేస్తున్నాయని చెబుతున్నారు. అయితే ఉపాధి కల్పనే లక్ష్యంగా ఐటీ కంపెనీలకు రాయితీలు ఇచ్చినందున.. 15 లక్షల మంది కోసమేనా ఆఫీసులు తెరవాల్సిందేనని ప్రభుత్వం గట్టిగా చెబుతుందని సమాచారం. చూడాలి మరీ తెలంగాణ సర్కార్, ఐటీ కంపెనీల మధ్య వివాదం ఎంత వరకు వెళుతుందో..