ఈట‌ల పాద‌యాత్ర ఇక లేన‌ట్టేనా? క్లారిటీ ఇచ్చిన రాజేంద‌ర్‌..

12 రోజులు.. 222 కిలోమీట‌ర్లు.. రోజంతా న‌డ‌క‌.. దారంతా జ‌నం.. జెండాలు.. జేజేలు.. ప‌ల‌క‌రింపులు.. ప్ర‌సంగాలు.. దండాలు.. దండోరాలు.. అబ్బో పాద‌యాత్ర అంటే మామూలా. చావోరేవో అన్న‌ట్టు సాగుతోంది ఈట‌ల ప్ర‌జాదీవ‌న యాత్ర. 

అస‌లే చిన్న ప్రాణం. మ‌నిషి మ‌రీ బ‌ల‌హీనం. అంత దూరం పాద‌యాత్రకు ఈట‌ల శ‌రీరం త‌ట్టుకోలేక‌పోయిన‌ట్టుంది. అనేక‌మంది మ‌నుషులు, అనేక ప్రాంతాలు, టైంకి తిన‌లేక‌పోవ‌డం, కంటినిండా కునుకు లేక‌పోవ‌డం.. ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో కావొచ్చు ఆయ‌న‌కు జ్వ‌రం వ‌చ్చింది. షుగ‌ర్ లెవెల్స్ పెరిగాయి. ఆక్సిజ‌న్ లెవెల్స్ పడిపోయాయి. అస్వ‌స్థ‌త‌కు గురైన ఈట‌ల నడవలేని స్థితిలో ఉండటంతో పాదయాత్రను అర్థాంత‌రంగా నిలిపివేశారు. డాక్ట‌ర్ల స‌ల‌హా మేర‌కు వెంట‌నే హైద‌రాబాద్ త‌ర‌లించారు. ఈటల అనారోగ్యం పాలవడంతో పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు.  

ఈట‌ల పాద‌యాత్ర‌కు బ్రేక్ ప‌డ‌టంతో.. ఇక ఈట‌ల ప‌ని అయిపోయింద‌ని.. ఇక‌పై పాద‌యాత్ర ఉండ‌బోద‌ని.. పాద‌యాత్ర చేయ‌లేకే ఇలా డ్రామా చేశార‌ని.. ఇలా ర‌క‌ర‌కాల వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. చాలా వ‌ర‌కూ నెగ‌టివ్ న్యూస్ స‌ర్క్యూలేట్ అవుతుండ‌టంతో.. త‌న పాద‌యాత్ర‌పై ఈట‌ల‌నే క్లారిటీ ఇచ్చారు. ఆ మేర‌కు ట్విటర్‌లో అప్‌డేట్ ఇచ్చారు. 

‘‘ 12 రోజులుగా, 222 కిలోమీటర్లకు పైగా సాగిన ప్రజా దీవెన యాత్రలో ప్రతిక్షణం నా వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనం. వేయాల్సిన అడుగులు, చేరాల్సిన ఊళ్లు చాలా ఉన్నాయి. కానీ ఊహించని అస్వస్థత వల్ల ప్రజాదీవెన యాత్రని తాత్కాలికంగా నిలిపివేయాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉంది. ఆరోగ్యం సహకరించగానే ప్రజా దీవెన యాత్ర మళ్లీ పునఃప్రారంభం అవుతుంది. ఆగిన చోటు నుంచే అడుగులు మొదలవుతాయి. కొండంత మీ దీవెనలతో త్వరలో ప్రజాదీవెన యాత్రతో వస్తా’’ అంటూ ఈట‌ల‌ ట్వీట్ చేశారు. సో.. పాద‌యాత్ర‌కు తాత్కాలిక విరామం మాత్ర‌మే. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ పాద‌యాత్ర ఆగిన చోటు నుంచే కంటిన్యూ చేస్తానంటూ క్లారిటీ ఇచ్చారు ఈట‌ల రాజేంద‌ర్‌.