గాలి వ్యవహారాల్లో భార్యదే కీలకపాత్ర
posted on Sep 9, 2011 10:15AM
బళ్లారి
: అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి వ్యవహారాల్లో కీలకమైన పాత్ర ఆమె భార్య అరుణదేనట. ఈ మేరకు ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక శుక్రవారం ఓ వార్తా కథనం ప్రచురించింది. ఆ వార్తాకథనం ప్రకారం - గాలి భార్య అరుణ సంతకం చేస్తేనే ఎలాంటి బిల్లయినా ఆమోదం పొందుతుందని తెలిసింది. గాలి లేకున్నా మేడం సంతకం చేస్తే చాలు ఆ చెక్కు ఆమోదం పొందుతుందట. సీబీఐ సోదాలతో ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూస్తున్నాయి. జనార్దన రెడ్డి ఇంటిపై దాడులు చేసి చెక్ బుక్‌లు, దస్తావేజులు, బ్యాంకు పాస్‌పుస్తకాలను స్వాధీనం చేసుకున్న సీబీఐ అధికారులు రూ.కోట్లతో జరిపిన లావాదేవీల్లో అరుణ సంతకాలే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమెతో సిబిఐ అధికారులు మాట్లాడి మరిన్ని కీలకమైన అంశాలను రాబట్టినట్లు తెలిసింది. విదేశాల్లో ఎక్కడెక్కడ పెట్టుబడులున్నాయి? ఏయే కంపెనీల్లో భాగస్వామ్యం ఉంది? మరింత డబ్బు ఎక్కడ దాచారు? బంగారు, వజ్రవైఢూర్యాలు ఎక్కడ దాచిపెట్టారు.. తదితర విషయాలను కూడా గాలి అరుణను ప్రశ్నించి సిబిఐ అధికారులు వివరాలు రాబట్టారని సమాచారం.