తప్పేముంది?.. బాబు హస్తిన పర్యటనపై బండి
posted on Jun 5, 2023 9:50AM
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. ఈ భేటీని పురస్కరించుకుని తెలుగుదేశం, బీజేపీ పొత్తు గురించి వస్తున్న ఊహాగానాలను తోసి పుచ్చారు. అవన్నీ ఊహాగానాలేనని కుండ బద్దలు కొట్టేశారు.
గతంలో కూడా తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీష్ కుమార్.. ఇంకా పలువురు ప్రతిపక్ష నేతలు కూడా ప్రధాని, హోంమంత్రితో భేటీ అయిన సందర్భాలను ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. కేంద్రంలో మోడీ సర్కార్ తొమ్మిది సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భంగా ఈ నెలాఖరు వరకూ నిర్వహిస్తున్న మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చేందుకు బండి సంజయ్ తెలంగాణలోని వివిధ జిల్లాల పార్టీ నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
గడప గడపకూ బీజేపీ పేరుతో కేంద్ర ప్రభుత్వ ఫలాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగానే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అమిత్ షా, నడ్డాలతో భేటీ నేపథ్యంలో బీజేపీ, తెలుగుదేశం పొత్తులపై మీడియాలో సాగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టి పారేశారు. ఊహాజనిత వార్తలను పట్టించుకోనవసరం లేదన్న బండి సంజయ్ దేశ సమగ్రాభివ్రుద్దే లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ పని చేస్తోందని చెప్పారు. రాష్ట్రాల అభివృద్ధి కోసం ఒక్క చంద్రబాబుతోనే కాదు.. మమతా బెనర్జీ, స్టాలిన్ ఆఖరకి కేసీఆర్ తో కూడా గతంలో మోడీ, షా భేటీ అయిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
మరో వైపు ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మాత్రం చంద్రబాబు అమిత్, షా నడ్డాలతో భేటీని భూతద్దంలో చూస్తూ ఖంగారు పడుతోంది. బీజేపీ అగ్రనాయకత్వం పిలుపుపై చంద్రబాబు హస్తిన వెళ్లిన సంగతిని ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తూ.. బాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారంటూ కథనాలను వండి వారుస్తోంది. అదే సమయంలో తెలుగుదేశం మాత్రం ఈ భేటీపై ఎటువంటి వ్యాఖ్యలూ చేయడం లేదు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం మాత్రమే చంద్రబాబు హస్తినలో అమిత్ షాతో మాట్లాడారని అంటోంది. మొత్తం మీద చంద్రబాబు హస్తిన పర్యటన ఇటు ఏపీలోనే కాకుండా, అటు తెలంగాణలో కూడా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.