అంటరాని వారి అభ్యున్నతికి జీవితాన్ని ధారపోసిన బూబు జగ్జీవన్ రామ్..!
posted on Apr 5, 2025 9:30AM

బాబు జగ్జీవన్ రామ్ చాలా తక్కువ మందికి తెలిసిన వ్యక్తి. విద్యార్థులను, యువతను ప్రశ్నిస్తే ఈయన గురించి చెప్పేవారు తక్కువ. కానీ ఈయన తన జీవితాన్ని అంటరాని వారి అభ్యున్నతి కోసం అంకితం చేశారు. అంటరానివారికి సమానత్వం సాధించడానికి అంకితమైన సంస్థ అయిన ఆల్-ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ స్థాపనకు దోహదపడ్డారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన బాబూ జగ్జీవన్ రామ్ పుట్టినరోజును చాలా గొప్పగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని సెలవు దినంగా కూడా పరిగణిస్తారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ గురించి తెలుసుకుంటే..
జగ్జీవన్ రామ్ ను బాబూజీ అని పిలుచుకుంటారు. ఈయన 1908 ఏప్రిల్ 5న బీహార్‌లోని 'అంటరాని' కులంలో జన్మించాడు. ఈయన జన్మించినది సామాన్య రైతు కుటుంబంలోనే. ఈయనకు ఒక అన్న, ముగ్గురు చెల్లెళ్లు ఉండేవారు. ఈయన తన బాల్యంలో, విద్యాభ్యాసం కొనసాగిస్తున్న రోజుల్లో కూడా షెడ్యూల్డ్ కులాలు, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడాలనే తన కోరికను వ్యక్తం చేసేవాడు.
బాబూ జగ్జీవన్ రామ్ అడుగడుగునా వివక్షణ ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ ఆ వివక్షలను లెక్క చేయకుండా చదువులో రాణించాడు. 1931 లో సైన్స్ లో డిగ్రీ పొందాడు. అయినప్పటికీ ఆయనకు సామాజిక కార్యకలాపాలపై ఆసక్తి ఉండేది. ఎప్పుడూ అంటరాని వారికి సమానత్వం సాధించే విషయం గురించి ఆలోచించేవాడు. ఈయనలో ఉన్న ఈ తపనను నేతాజీ సుభాష్ చంద్రబోస్ పరిశీలించాడు. ఈ కారణంగా బాబు జగ్జీవన్ రామ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ దృష్టిని ఆకర్షించి అతన్ని రాజకీయ జీవితంలోకి ఆకర్షించేలా చేసింది.
నిజానికి, బాబు జగ్జీవన్ రామ్ 1936 నుండి 1986 వరకు 50 సంవత్సరాలు నిరంతరాయంగా పార్లమెంటేరియన్‌గా ఉన్నారు. ఇది ప్రపంచ రికార్డును నమోదు చేసింది.
బాబు జగ్జీవన్ రామ్ జవహర్‌లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలోని మొదటి క్యాబినెట్‌లో సభ్యుడు. అంతేకాదు ఈ క్యాబినెట్ లో ఆయన అతి పిన్న వయస్కుడైన మంత్రిగా, భారత రాజ్యాంగ సభలో సభ్యుడిగా ఉండేవారు. ఆయన ఉన్నత పదవులకు వెళ్లి రక్షణ మంత్రిగా (1970 - 1974), ఉప ప్రధాన మంత్రిగా (1977 - 1979) కూడా పనిచేశారు. ఆయన 1986లో మరణించారు. ఆయన మరణించే వరకు పార్లమెంటు సభ్యుడిగా కొనసాగారు.
*రూపశ్రీ.