వైసీపీ ఎమ్మెల్యేల హౌస్ అరెస్టు
posted on May 13, 2024 5:36PM
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ అధికార వైసీపీ అన్ని విలువలకూ వలువలు విప్పేసి యథేచ్ఛగా దాడులు, దౌర్జన్యాలకు తెగబడింది. అదే సమయంలో ఎన్నికల సంఘం కూడా హింసాత్మక ఘటనలపై సీరియస్ గా స్పందించి ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్టు చేసింది. ఏపీలో ఓటర్లు చైతన్యవంతంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోటెత్తుతున్నారు.
ఒటర్ మూడ్ ఎప్పుడో అర్ధమైన వైసీపీ పోలింగ్ ప్రక్రియకు అవరోధాలు, అడ్డంకులు సృష్టించడమే ధ్యేయంగా హింసాకాండకు తెగబడింది. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు పల్నాడులో వైసీపీ దౌర్జన్య కాండకు దిగింది. అయితే వైసీపీ దౌర్జన్యాలను జనం కూడా అదే స్థాయిలో ప్రతిఘటించి, తమ ఓటు హక్కు వినియోగించుకుని తీరుతామన్న పట్టుదల కనబరిచారు.
ఈ క్రమంలో తెనాలి శివకుమార్ దాష్టీకంపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఆయనను వెంటనే అదుపులోనికి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఆయనను పోలింగ్ పూర్తయ్యే వరకూ నిర్బంధంలో ఉంచాలని హుకుం జారీ చేసింది. అలాగే నరసరావుపేట వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని కూడా పోలింగ్ పూర్తయ్యేవరకు శ్రీనివాస్ రెడ్డిని గృహనిర్భంధంలో ఉంచాలని ఆదేశించింది.
ముందుగా అన్నాబత్తుని శివకుమార్ విషయానికి వస్తే తెనాలిలోని ఓ పోలింగ్ కేంద్రంలోకి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లిన ఆయనను క్యూలైన్ లో నిలబడాల్సిందిగా ఓ ఒటరు సూచించారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా అయిన శివకుమార్ సహనం కోల్పోయి ఆగ్రహంతో ఊగిపోతూ ఆ ఓటర్ పై చేయి చేసుకున్నారు. అయితే ఆ ఓటరు ప్రతిఘటించి తిరిగి ఎమ్మెల్యే చెంప ఛెళ్లుమనిపించారు. దీంతో శివకుమార్ అనుచరులు ఓటరుపై దాడి చేసి తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై ఎన్నికల సంఘం సీరియస్ గా స్పందించి అన్నాబత్తుని శివకుమార్ ను గృహ నిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది. అంతే కాకుండా ఆయనపై ఎఫ్ ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఈ ఘటనపై శివకుమార్ స్పందించారు. తాను తెనాలి ఐతానగర్‌లో తన భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్లిన సందర్భంలో గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తి తనను దూషించాడనీ దీంతో తాను ఆగ్రహావేశాలకు లోనయ్యాననీ పేర్కొన్నారు. అదీ కాక ఉదయం నుంచీ కూడా సుధాకర్ అక్కడి పోలింగ్ బూత్ వద్ద హల్ చల్ చేస్తూనే ఉన్నారని ఆరోపించారు.
అదే విధంగా మాచర్ల నియోజకవర్గంలో దాడులు, దౌర్జన్యాలకు అధికార వైసీపీ మూకలు తెగబడిన నేపథ్యంలో సీరియస్ గా స్పందించిన ఎన్నికల సంఘం మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలను హౌస్ అరెస్టు చేయాల్సిందిగా ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు పోలీసులు వారిరువురినీ గృహ నిర్బంధంలో ఉంచారు.