రఘురామ కాలి గాయాలపై రిపోర్ట్! ఆర్మీ వైద్యులు ఏం చెప్పారంటే..

ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా, రాజకీయ రచ్చగా మారిన వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు కేసులో సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. మూడు రోజుల హైడ్రామా తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో రఘురామను గుంటూరు జైలు నుంచి సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ కు తరలించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మెడికల్ రిపోర్టును ఆర్మీ హాస్పిటల్ వైద్య బృందం.. తెలంగాణ హైకోర్టు నియమించిన న్యాయాధికారి ద్వారా సుప్రీంకోర్టుకు అందించనుంది. రిపోర్ట్ చూసిన తర్వాత .. ఈ కేసులో తదుపరి విచారణ  శుక్రవారం జరపనుంది దేశ అత్యున్నత న్యాయస్థానం. రఘురామ బెయిల్ పిటీషన్ పైనా విచారణ జరపనుంది. 

ఏపీ వ్యాప్తంగా  ఇప్పుడు ఎంపీ రఘురామకృష్ణరాజు మెడికల్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఏపీ వైద్యులు ఆయనకు తాజాగా దెబ్బలు ఏం అవ్వలేదని స్పష్లం చేశారు.  దీంతో ఇప్పుడు ఆర్మీ హాస్పిటల్ మెడికల్ రిపోర్ట్ ఎలా వస్తుంది అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒక వేళ అవి తాజాగా తగిలిన దెబ్బలే అని తేలితే.. ఏపీలో సీఐడీ పోలీసుల వ్యవహారాన్ని కోర్టు చాలా సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది. జగన్ ప్రభుత్వం కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కోవల్సి వస్తుంది. రఘురామ కాలికి ఉన్నవి  తాజాగా కొట్టిన దెబ్బలు కాదని తెలిస్తే.. అసత్యాలు చెప్పినందుకు ఎంపీ కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని అంటున్నారు. 

సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ లో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పరీక్షలు, వైద్య చికిత్స కొనసాగాయి.  వైద్య పరీక్షలను అధికారులు వీడియోలో చిత్రీకరించారు.  చికిత్స సందర్భంగా ఆయన మాటలను కూడా రికార్డు చేశారు.ఆస్పత్రిలోని వీఐపీ స్పెషల్‌ రూమ్‌లో ముగ్గురు ఆర్మీ వైద్య అధికారుల బృందం నేతృత్వంలో ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని చికిత్స, అవసరమైన వైద్య పరీక్షలు చేపట్టారు. కుడి కాలికి తీవ్రమైన వాపు ఉండడంతో నొప్పి తగ్గించడానికి, అంతర్గత గాయాల నొప్పి తగ్గించడానికి వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. సేకరించిన రక్త నమూనాలను ల్యాబ్‌కు పంపించినట్లు సమాచారం.  ఈ ప్రక్రియ పర్యవేక్షణ కోసం తెలంగాణ హైకోర్టు తమ రిజిస్ట్రార్‌ నాగార్జునను జ్యుడీషియల్‌ అధికారిగా నియమించింది. ఆయన సమక్షంలోనే ఆర్మీ వైద్యులు రఘురామరాజుకు అవసరమైన చికిత్స అందించారు. పరీక్షల  వివరాలను ఆర్మీ ఆస్పత్రి అధికారులు హైకోర్టు రిజిస్ర్టార్‌ ద్వారా ఈ నెల 21న సుప్రీంకోర్టుకు సీల్డ్‌ కవర్‌లో అందజేయనున్నారు.సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆర్మీ ఆసుపత్రిలోనే రఘురామ ఉండనున్నారు.

ఎంపీ రఘురామకు అందిస్తున్న వైద్యం, చేస్తున్న పరీక్షలపై ఆర్మీ ఆస్పత్రి వర్గాలు అత్యంత గోప్యత పాటిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను సోమవారం రాత్రి ఆస్పత్రికి తీసుకొచ్చారని.. అధికారిక లాంఛనాలు పూర్తయ్యాక అడ్మిట్‌ చేసుకున్నామని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ముగ్గురు వైద్యులతో ఏర్పాటైన మెడికల్‌ బోర్డు.. హైకోర్టు నియమించిన జ్యుడీషియల్‌ అధికారి సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించిందని తెలిపారు. ప్రస్తుతం రఘురామరాజు మెడికల్‌ కేర్‌లో ఉన్నారని, సుప్రీంకోర్టు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఆయన ఇక్కడే ఉంటారని చెప్పారు. కొవిడ్‌ మెడికల్‌ ప్రోటోకాల్‌ ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రఘురామరాజు ఆరోగ్యం, చికిత్స గురించి తమకు సమాచారం ఇవ్వలేదని కుటుంబసభ్యులు తెలిపారు. సోమవారం రాత్రి ఆస్పత్రిలోకి తీసుకెళ్లేముందు ఆయనతో మాట్లాడామని, తర్వాత ఆర్మీ అధికారులు తమను ఆస్పత్రిలోకి అనుమతించలేదని చెప్పారు. మంగళవారం తండ్రిని కలిసేందుకు ఎంపీ కుమారుడు భరత్‌ అక్కడకు వెళ్లారు. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నందున కలవడానికి వీలు లేదని ఆర్మీ అధికారులు స్పష్టం చేయడంతో భరత్‌ వెనుదిరిగారు.