వేరుపడనున్న ప్రగతి రధ చక్రాలు

 

వచ్చే నెల 2వ తేదీకి అధికారికంగా రాష్ట్రం విడిపోయి ఒక సంవత్సరం పూర్తవుతుంది. కానీ ఇంకా ఏపియస్ ఆర్టీసీ మాత్రం ఉమ్మడిగానే కొనసాగుతోంది. ఇంతవరకు ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల పంపకాలు పూర్తికాకపోవడంతో ఆర్టీసీ విభజన ఆలశ్యమవుతోంది. కానీ జూన్ 3వ తేదీ నుండి రెండు రాష్ట్రాల ఆర్టీసీలు వేరువేరుగా పనిచేసేందుకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి హైదరాబాద్ లో గల బస్‌భవన్‌లోని ఏ బ్లాక్ నుంచి ఏపీఎస్ ఆర్టీసీ, బీ బ్లాక్ నుండి తెలంగాణ ఆర్టీసీ తమతమ కార్యకలాపాలు మొదలుపెట్టనున్నాయి. కానీ వీలయినంత త్వరగా ఆంద్రప్రదేశ్ ఆర్టీసీ ప్రధాన కార్యాలయాన్ని విజయవాడకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 

ఇక రెండు రాష్ట్రాల ఆర్టీసీలు వేర్వేరుగా పనిచేయడం ప్రారంభిస్తున్నందున, హైదరాబాద్ లో స్థిరపడిన ఆంద్రప్రదేశ్ కి చెందిన ఉద్యోగుల పరిస్థితే కొంచెం అయోమయంలో పడింది. ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులయితే తమకు బస్ భవన్ లో కేటాయించిన ఏ బ్లాక్ లో పనిచేసుకోవచ్చును. కానీ డ్రైవర్లు, కండెక్టర్లు, మెకానిక్కులు, డిపో సిబ్బంది వంటి వారిని సర్దుబాటు చేయడమే చాలా కష్టం అవుతుంది. వారందరూ ఇప్పటికిప్పుడు హైదరాబాద్ విడిచిపెట్టి ఆంధ్రాకి తరలిపోవడం సాధ్యం కాదు. అలాగని అక్కడే కొనసాగలేని పరిస్థితి. జనాభా ప్రాతిపదికన 58:42 నిష్పత్తిలో ఆర్టీసీ ఉద్యోగులను విభజిస్తామని ఆర్టీసీ యండీ సాంబశివరావు తాజాగా ఒక సర్క్యులర్ జారీ చేసినప్పటికీ, ఈ సమస్యను పరిష్కరించడం కొంచెం కష్టమేనని చెప్పవచ్చును. ఇక ఆర్టీసీ ఆస్తులు, అప్పుల విభజన లెక్కలు చూసేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన షీలాభిడే కమిటీ గడువు ఈనెలాఖరుతో ముగియనుంది. కానీ ఇంకా దాని పని పూర్తి కాకపోవడంతో మరో రెండు మూడు నెలలయినా గడువు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.