అంకెల్లో విజయం... నైతిక పరాజయం...
posted on Jul 21, 2018 9:54AM
అందరూ ఊహించినదే జరిగింది. అందరూ అనుకున్నదే కళ‌్లముందు ప్రత్యక్షమైంది. ఆంధ్రుల కనీస హక్కులకు విఘాతం కలిగింది. దింపుడు కళ్లెం ఆశ నిరాశగానే మిగిలింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై మిగిలిన చివరి ప్రయత్నానికి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ లోక్‌సభ సాక్షిగా మంగళం పాడింది. శుక్రవారం లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై జరిగిన చర్చ... అనంతరం జరిగిన ఓటింగ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రజలనే కాదు... యావత్ దేశాన్నే ఆశ్చర్యానికి గురి చేసాయి. ఈ అవిశ్వాసానికి మద్దతుగా లోక్‌సభలో వివిధ రాజకీయ పార్టీలు సహకరిస్తాయని, కేంద్రం చూపుతున్న వివక్షను దేశం ముందు ఉంచవచ్చునన్న తెలుగుదేశం వ్యూహం కొంత వరకూ ఫలించింది. అయితే నెంబర్ గేమ్‌లో మాత్రం లోక్‌సభ సాక్షిగా ఓడిపోయింది.
534 మంది సభ్యులున్న లోక్‌సభలో 451 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇందులో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 126 మంది సభ్యులు ఓటు చేస్తే 325 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రం, తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి, అధికార బిజెపి కూటమిలో ఉన్న శివసేవ ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఒడిషాకు చెందిన బీజేడీ సభ నుంచి వాకౌట్ చేసింది. మొత్తానికి సంఖ్య పరంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్కార్ లోక్‌సభలో విజయం సాధించింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ జరిగిన చర్చ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆందోళన, ఆవేదనలను జాతీయ స్థాయిలో తెలిసేలా చేసింది. తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్యమంత్రి, మంత్రులు, పార్టీ నాయకులు పదేపదే చేబుతున్న వాస్తవాలను ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులు సభ ముందుంచడంలో సఫలమయ్యారనే చెప్పాలి. దీని ద్వారా జాతీయ స్ధాయిలో అందరి చూపు ఆంధ్రప్రదేశ్ వైపు పడేలా చేశారు.
ఇందుకు తెలుగుదేశం లోక్‌సభ సభ్యులను అభినందించాల్సిందే. లెక్కలే దేనికైనా గీటురాయిగా మారిన దశలో ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీలు, అక్కడి ప్రజలు లోక్‌సభలో అంకెల పరాజయాన్ని నైతిక విజయంగానే పరిగణించాలి. అవిశ్వాసంపై గెలుపోటములు ఎలా ఉన్నా ఆవేదన నిండిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తన ప్రసంగం ద్వారా కాసింతైనా ప్రధాని స్వాంతన చేకూరుస్తారని అందరూ ఆశించారు. అయితే ప్రధాని ఆ పని కూడా చేయకపోవడం ఏపీ ప్రజల పట్ల ఆయనకున్న వివక్షకు తార్కాణం. ప్రధానమంత్రి తన ప్రసంగంలో ఇవి చేశాం... ఇవి చేస్తాం అని చెప్పకుండా తెలుగుదేశం పార్టీ తమను వీడి ఎందుకు వెళ్లింది.... విభజన పాపం తమది కాదు అని చెప్పడానికే పరిమితం కావడం ఆయనకూ.... ప్రధాని పదవికీ తగింది కాదు. ప్రధాని ప్రసంగంలో ఎక్కడా సానుభూతి కాని, సహానుభూతి కాని కనిపించకపోవడం ఆ పార్టీకి ఏపీ ప్రజలపై ఉన్న నిర్లక్ష్యాన్ని, వారి నిరంకుశత్వాన్ని తెలియజేస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ లోక్‌సభలో వ్యవహరించిన తీరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజల మద్దతు లభించే అవకాశాలున్నాయి.
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. తనను శత్రుపక్షం... ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పప్పు అని ఎగతాళి చేసినా తాను బాధపడనని చెప్పిన తీరు యావత్ దేశాన్ని ఆకట్టుకుంది. అంతే కాదు తనపై ప్రధానికి అకారణ కోపం ఉందని, దానిని ఈ సభలోనే తొలగిస్తానంటూ సభలో అందరి ముందు ప్రధాని స్ధానం దగ్గరకు వెళ్లి ఆయనకు షేక్‌హ్యాండ్ ఇచ్చి కౌగలించుకున్న తీరు అందరినీ ఆశ్యర్యపరిచింది. రాహుల్ చర్యను అపరిపక్వ చర్యగా భారతీయ జనతా పార్టీ భావిస్తున్నా.... ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు మాత్రం ప్రశంసిస్తున్నారు. ఇది రాహుల్ గాంధీలో రాజకీయంగా వచ్చిన ఎదుగుదలకు చిహ్నంగా గుర్తిస్తున్నారు.
ఇది కాంగ్రెస్ పార్టీకి మాత్రం కలిసి వచ్చే చర్యగానే చూడాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు లోక్‌సభలో రాహుల్ ప్రసంగం... ఆయన ప్రవర్తించిన తీరు కలిసి వస్తుందని ఏపీ కాంగ్రెస్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక భారతీయ జనతా పార్టీ ఈ తాత్కాలిక విజయానికి సంబరాలు చేసుకోవడం కంటే సభలో వివిధ పార్టీలు తమను ఎండగట్టిన తీరుపై ఆత్మ విమర్శ చేసుకుని తప్పులు సరిదిద్దుకోకపోతే భవిష్యత్ అంత అందంగా ఉండదు. నియంతగా వ్యవహరించిన ఇందిరాగాంధీకే పాఠాలు నేర్పిన దేశ ప్రజలు... ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నరేంద్ర మోదీకీ, భారతీయ జనతా పార్టీకి చుక్కలు చూపించడం తథ్యం.