మోదీని వాటేసుకున్న రాహుల్ .. 2019లో విజయాన్ని కూడా వాటేసుకుంటాడా?
posted on Jul 20, 2018 6:27PM
అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఏపీకి కీలకం ప్రత్యేక హోదా. కానీ, దేశంలోని మిగతా రాష్ట్రాలన్నీ రాహుల్ వర్సెస్ మోదీ వార్ పైనే దృష్టి పెట్టాయి! ఎందుకంటే, మరి కొన్ని నెలల్లోనే మోదీ, రాహుల్ ప్రధాని పదవి కోసం తొలిసారి సమరానికి సై అనబోతున్నారు. ఇండియాలో అమెరికా లాంటి ప్రెసిడెన్షియల్ ఎన్నికలు వుండవు కాబట్టి చాలా వరకూ ప్రధాని ఎవరు కాబోతున్నారు అన్నది పెద్దగా ప్రాముఖ్యత వహించదు. కానీ, నెహ్రు, ఇందిర, ఇప్పుడు మోదీ లాంటి వారు వున్నప్పుడు పీఎం ఎవరో ముందే తెలిసిపోతుంది కాబట్టి వ్యక్తుల చుట్టూ రాజకీయం నడుస్తుంది. 2014లో అదే జరిగింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఒకవైపు మన్మోహన్ మళ్లీ ప్రధాని అని గట్టిగా చెప్పలేదు. రాహుల్ ని కూడా ప్రైమినిస్టర్ చేస్తామని ప్రకటించలేదు. అలాంటి సమయంలో బీజేపీ మోదీని తన ప్రధాని అభ్యర్థిగా పూర్తిస్థాయిలో ప్రచారం చేసుకుని ముందుకొచ్చింది. అదే కాషాయదళానికి, ఎన్డీఏకి కలిసి వచ్చి మోదీ వేవ్ కొనసాగింది. అయితే, 2019 ఎన్నికలు అందుకు భిన్నంగా వుండబోతున్నాయి!
ఆ మధ్య కర్ణాటక ఎన్నికల సమయంలో రాహుల్ నేను ప్రధాని పదవికి సిద్ధం అని వ్యాఖ్యానించారు. అలా ఆయన స్వయంగా చెప్పటం అదే మొదటి సారి. అయితే, ఇప్పుడు చర్చకొచ్చిన అవిశ్వాస తీర్మానం పరోక్షంగా రాహుల్ ను ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టగలిగింది. తన సుదీర్ఘ ప్రసంగంలో ఎప్పటిలా పెద్ద పెద్ద తప్పులు ఏం మాట్లాడలేదు రాహుల్. గతంలో కన్నా ఆరోపణల్లో పరిణతి కూడా కనబరిచాడు. మోదీపై వ్యక్తిగత విమర్శలు చేస్తూనే ఆయన నాలుగేళ్ల ప్రభుత్వాన్ని కూడా ఎండగట్టాడు. ఒక విధంగా రాహుల్ రోజు రోజుకు ఎదుగుతున్నాడనే చెప్పుకోవాలి. అలాగే, బీజేపీ వారు, బీజేపీ అభిమానులు, మోదీ భక్తులు సోషల్ మీడియాలో అన్నట్టు రాహుల్ ని పప్పు అనటం ఇక మీదట కాస్త కష్టమే. ఆయన మరీ అపర చాణుక్యుడైన రాజకీయ నేత అయిపోయాడని చెప్పలేకున్నా… మోదీకి ప్రస్తుతం కనుచూపు మేరలో వున్న ప్రత్యర్థి రాహులే అయ్యాడు!
వచ్చే ఎన్నికల్లో మోదీకి 2014లో లాగా స్వంత మెజార్టీ రాకుంటే తాము ప్రధానులు అయ్యేందుకు బీజేపీలోనే చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఎన్డీఏలోని పక్షాలు మోదీని తిరస్కరిస్తే పీఎం అయ్యే కలల్లో చాలా మంది కాషాయ నేతలున్నారు. వార్ని పక్కన పెడితే ప్రస్తుతం లోక్ సభలో ఒక్కరంటే ఒక్క ఎంపీ కూడా లేని మాయవతి నెక్ట్స్ పీఎం అవ్వాలని భావిస్తున్నారు. ఆమెలాగే మమతా బెనర్జీ, శరద్ పవార్, ములాయం, మన కేసీఆర్ … ఇలా చాలా మందే ప్రధాని పదవి రేసులో వున్నారు. అయితే, వీరికి అవకాశాలు ఎంతగా వున్నాయి? అదే విషయాన్ని తేల్చేసింది తాజా అవిశ్వాస తీర్మానం!
అవిశ్వాస తీర్మానం సందర్భంగా అందరి దృష్టి రాహుల్ మీదే పడింది. ఆయన మోదీపై చేసే ఆరోపణలు ఏంటనే ఎదురు చూశారు. తానే ఆ మధ్య అన్నట్టు భూకంపం పుట్టిస్తాడా అని ఆశించారు! భూకంపం అయితే రాలేదుగాని… పార్లమెంట్లో నవ్వులు పూశాయి! తన ప్రసంగం అయ్యాక మోదీ వద్దకెళ్లి రాహుల్ ఆలింగనం చేసుకున్నాడు! ఇది మోదీతో సహా అందర్నీ ఆశ్చర్యపరిచింది. తనని పప్పు అని ఎగతాళి చేసినా సరేనంటూ రాహుల్ మోదీ వద్దకెళ్లి ఆలింగనం రాజకీయం చేశాడు! ఇది నిజంగా ఆశ్చర్యకరమే! అంతకంటే ఎక్కువగా మారుతున్న రాహుల్ వ్యక్తిత్వానికి సూచిక!
రాహుల్ అవిశ్వాస తీర్మానం గురించి చేసిన ప్రసంగం రేపటికల్లా అందరూ మరిచిపోవచ్చు. కానీ, ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ మారుతున్న ట్రెండ్ మాత్రం అందరూ గమనిస్తున్నారు. ప్రాంతీయ నేతలు ఎందరు పీఎం రేస్ లోకి వచ్చినా మోదీ తరువాత నెంబర్ టూగా వుంటోంది రాహులే! మరి ఆయన మోదీని వెనక్కి నెట్టి పీఎం అవుతారా? లేదంటే మరో అయిదేళ్లు కూడా మోదీని విమర్శిస్తూ, ఇలాగే ఆలింగనం చేసుకుంటూ జనంలో తనని తాను సీరియస్ పొలిటీషన్ గా ప్రూవ్ చేసుకుంటారా? 2019 ఎన్నికల ఫలితాలు వచ్చే నాటిదాకా మాత్రం వేచి చూడాల్సిందే!