చిక్కులో ఏపీ హోంమంత్రి! పదవి ఊస్టింగేనా?
posted on Aug 28, 2021 2:37PM
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత చిక్కుల్లో పడ్డారు. షెడ్యూల్డ్ కులాల హోదాను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలపై ఆమెపై విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ ను జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశించింది. వారం రోజుల్లో విచారణ జరపాలని గుంటూరు కలెక్టర్ వివేక్‌యాదవ్‌ను ఆదేశించింది. జాతీయ కమిషన్ ఆదేశాలతో జరుగుతున్న విచారణలో సుచరితకు వ్యతిరేకంగా నిర్ణయం వస్తే ఆమె పదవికి ఎసరు వచ్చినట్లే. గతంలో ఇలాంటి కేసుల్లో చాలా మంది తమ పదవులు కోల్పోయారు. అందుకే హోంమంత్రి మేకతోటి సుచరితపై విచారణకు ఆదేశించడంతో వైసీపీలో కలవరం మొదలైందని చెబుతున్నారు.
కేసు వివరాల్లోకి వెళితే ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన మేకతోటి సుచరిత.. తాను జీసస్ ను ప్రార్ధిస్తానని చెప్పారు. దీనిపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనే సంస్థ జాతీయ ఎస్సీ కమీషన్ కు ఫిర్యాదుచేసింది. సుచరిత మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌ను జతచేసి జూన్‌లో ఫిర్యాదు చేసింది. సుచరిత ఎస్సీ కాదని ఎస్సీ హోదాను దుర్వినియోగం చేస్తున్నట్లు ఫోరం ఫిర్యాదు చేసింది. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరింది. లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఫిర్యాదుపై స్పందించిన జాతీయ ఎస్సీ కమిషన్.. మేకతోటి సుచరితపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది.
భారత రాజ్యాంగం ప్రకారం ఏ మతం వాళ్ళు క్రిష్టియానిటి లోకి మారినా వెంటనే వాళ్ళు బీసీ క్యాటరిగిలోకి మారిపోతారు. రిజర్వుడు క్యాటగిరిలోని వాళ్ళు క్రిస్టియన్ మతాన్ని తీసుకుంటే అప్పటివరకు ఉన్న తమ మతాన్ని వదులుకోవాల్సిందే. క్రిస్తియానిటిలోకి మారిన తర్వాత కూడా అంతకుముందున్న రిజర్వేషన్ ఫలాలను ఇంకా అందుకుంటుంటే అది తప్పవుతుంది. ఈ విషయంలోనే సుచరితపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఫిర్యాదు చేసింది. మాజీ కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్‌కుమార్ చేసిన మతపరమైన వ్యాఖ్యలపై సివిల్ సర్వీసెస్ కమిషన్‌కు ఈ సంస్థ ఫిర్యాదు చేసింది. మరోవైపు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కులధ్రువీకరణ విషయంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.
గతంలో టీడీపీ హయాంలో ఇలాంటి వివాదమే జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డులో పాయకరావుపేట ఎస్సీ ఎంఎల్ఏ వంగలపూడి అనితను చంద్రబాబునాయుడు మెంబర్ గా నియమించారు. ఆమె నియామకంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ఆమె క్రిస్తియన్ అనే ఆరోపణలు అప్పటికే ఉన్నాయి. తాను ఎప్పుడూ జీసస్ నే ప్రారధిస్తుంటానని A ఇంటర్వ్యూల్లో అనిత చెప్పున్నారు. చెప్పటమే కాదు తన బ్యాగులో నుండి బైబిల్ ను తీసి ఇంటర్వ్యూలో చూపించారు. ఆ విడియోను వైరల్ చేశారు. జీసస్ ను ప్రార్థించే వ్యక్తిని టీటీడీ ట్రస్టు బోర్డులో చంద్రబాబు మెంబర్ గా ఎలా నియమిస్తారని హిందూ సంఘాలు ప్రశ్నించాయి. దీంతో వంగలపూడి అనిత టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ గా తప్పించారు అప్పటి సీఎం చంద్రబాబు.
అనిత విషయంలో గోల చేసిన హిందూ సంఘాలు మేకతోటి సుచరిత విషయంలోనూ పోరాటానికి సిద్ధమవుతున్నాయి. జాతీయ ఎస్సీ కమిషన్ కు ఆధారాలు సమర్పించబోతున్నాయి. దీంతోహోంమంత్రి మేకతోటి సుచరిత పదవికి గండం వచ్చిందనే చర్చ జరుగుతోంది.