ప్రజా సంగ్రామ యాత్ర షురూ.. కేసీఆర్‌పై సంగ్రామానికి బండి సంజయ్ అడుగులు..
posted on Aug 28, 2021 2:22PM
తెలంగాణలో రాజకీయ మార్పునకు ప్రజా సంగ్రామ యాత్రతో శ్రీకారం. ప్రజల్లో విశ్వాసం, ఆత్మస్థైర్యం కల్పించేందుకే ప్రజా సంగ్రామ యాత్ర. ఎంఐఎం ఆగడాలను బరించలేక పాతబస్తీని వదిలి వెళ్లిన హిందువులంతా తిరిగి రావాలంటూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపునిచ్చారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రజా సంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టారు బండి సంజయ్. ఈ సందర్భంగా చార్మినార్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ సర్కారుపై విరుచుకుపడ్డారు.
‘‘తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1400 మంది బలిదానాలు చేశారు. అమరుల ఆకాంక్షలకు, ఆశయాలకు భిన్నంగా రాష్ట్రంలో ఒక్క కుటుంబమే పాలన సాగిస్తోంది. సీఎం కేసీఆర్ హయాంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. రైతులందరికీ ఉచిత యూరియా ఇస్తానని చెప్పి రైతులను మోసం చేశారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ నిరుద్యోగ యువకులను మోసగించారు. ఏడెనిమిది ఏళ్లు దాటినా ఇంత వరకు వాటి గురించి పట్టించుకోలేదు. ఒక్కో నిరుద్యోగికి లక్ష చొప్పున కేసీఆర్ ప్రభుత్వం బాకీ ఉంది. తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణంగా మార్చారు. దళితులకు మూడెకరాల భూమి, దళితుడిని సీఎం చేస్తానన్న హామీని సీఎం కేసీఆర్ అటకెక్కించారు. ‘దళిత బంధు’ పేరుతో దళితులను.. గొర్రెలు, బర్రెలంటూ బీసీలను వంచిస్తున్నారు’’ అని బండి సంజయ్ మండిపడ్డారు. ఎస్టీలకు 12 శాతం రిజిస్ట్రేషన్లు ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు.
ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సైతం కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘తెలంగాణలో నిజాంలాంటి పాలన అంతం కావాలి. అక్రమాలు, అవినీతి, అప్పుల పాలన పోవాలి. కుటుంబ పాలనకు తెరదించి ఒక ప్రజాస్వామ్య పాలనకు ప్రజలు స్వాగతం పలకాలి. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించే ఉద్యమం ఈ ప్రజా సంగ్రామ యాత్ర. కల్వకుంట్ల కుటుంబం అబద్ధాలపై పాలన సాగిస్తోంది. అవినీతి పాలనపోయి.. నీతివంతమైన పాలన రావాలంటే కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతోంది’’ అని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ పాలన నుంచి విముక్తి కలిగించాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు తరుణ్ చుగ్ అన్నారు. రాష్ట్రాన్ని ఆలీబాబా 40 దొంగల్లా పాలిస్తున్నారని విమర్శించారు. డీకే అరుణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ పాలనకు అంతం కోసమే ఈ యాత్ర నిర్వహిస్తున్నామని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ యాత్రతో పెనుమార్పులు సంభవించబోతున్నాయని కె.లక్ష్మణ్ అన్నారు. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని.. కారు, కాంగ్రెస్ రెండూ ఒకటేనని లక్ష్మన్ ఆరోపించారు.