అటు మల్లారెడ్డి.. ఇటు మోత్కుపల్లి! రేవంత్ పైకి పాత మిత్రులను ఉసిగొల్పుతున్నారా? 

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టార్గెట్ గా టీఆర్ఎస్ దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. గతంలో తమపై రేవంత్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేసినా గులాబీ లీడర్లు స్పందించేవారు కాదు. కాని తాజాగా సీన్ మారినట్లు కనిపిస్తోంది. కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి లక్ష్యంగా వరుసగా టీఆర్ఎస్ నేతలు బయటికి వస్తున్నారు. ఇందులో భాగంగానే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మంత్రి మల్లారెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నువ్వానేనా అనేలా ఇద్దరు పరస్పరం సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా మరోసారి  రేవంత్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు  మంత్రి మల్లారెడ్డి. తాను ఎంపీగా ఉన్నప్పటినుంచి రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని ఆరోపించారు.  తెలుగు దేశం పార్టీ మల్కాజ్‌గిరి సీటు రేవంత్‌కు కాకుండా తనకు ఇచ్చినందుకు బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారన్నారని చెప్పారు. అప్పటి నుంచి  రేవంత్‌ రెడ్డి తనను ఇబ్బంది పెడుతూనే ఉన్నారని మల్లారెడ్డి ఆరోపించారు.  

తనపై రేవంత్ రెడ్డి చేసిన అవినీతి ఆరోపణలపైనా స్పందించారు మల్లారెడ్డి. 2012లో మెడికల్ కాలేజీని ప్రారంభించినట్లు చెప్పారు. బాలికల కోసం ప్రత్యేకంగా మహిళా కళాశాలను స్థాపించినట్లుతెలిపారు. తన కాలేజీ హాస్టల్స్ లో దాదాపు 7వేల మంది విద్యార్థినులు ఉంటున్నారన్నారు మల్లారెడ్డి. ఏవో కాగితాలు తీసుకొచ్చి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, దొంగ పత్రాలు చూపెట్టి తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు.అన్ని అనుమతులతోనే ఆస్పత్రిని నిర్మించినట్లు మల్లారెడ్డి స్పష్టం చేశారు. తన కళాశాలలు, ఆస్పత్రులుకు సంబంధించిన అన్ని పత్రాలు సక్రమంగానే ఉన్నాయని.. తన సంస్థలను ఉన్నతంగా నడుపుతున్నట్లు వివరించారు. పార్లమెంటులో కూడా మల్లారెడ్డి విద్యా సంస్థల గురించి రేవంత్ రెడ్డి ప్రశ్నలు వేశారని.. తన విద్యా సంస్థల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని కేంద్రం లిఖిత పూర్వకంగా సమాధానం చెప్పిందని మల్లారెడ్డి చెప్పారు. 

మరోవైపు రేవంత్ రెడ్డికి పోటీగా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు రంగంలోకి దిగారు. రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఒక రోజు దీక్షను చేపట్టబోతున్నారు నర్సింహులు. కొన్ని రోజుల క్రితం వరకు బీజేపీలో ఉన్న మోత్కుపల్లి ఇటీవలే ఆ పార్టీకి రిజైన్ చేశారు. కేసీఆర్ కొత్తగా తీసుకువచ్చిన దళిత బంధును స్వాగతిస్తూ ప్రకటనలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ను పొగుడుతున్నారు. దీంతో మోత్కుపల్లి టీఆర్ఎస్ లో చేరతారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి టార్గెట్ గా నర్సింహులు దీక్షకు దిగుతున్నట్లు కనిపిస్తోంది. కొన్ని రోజులుగా రేవంత్ తీరు తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని మోత్కుపల్లి అన్నారు. దళితుల సాధికారత కోసం సభలు, సమావేశాలను నిర్వహించడం, గిరిజన ఆత్మగౌరవ దీక్షలను నిర్వహించడం వంటివి చేస్తుండటం తనకు విస్మయాన్ని కలిగిస్తోందని చెప్పారు. 

పుట్టుకతోనే దొరల వంశానికి చెందిన రేవంత్ రెడ్డి.. ఆయన స్వగ్రామంలో దళితుల మధ్య భోజనాలు, నిద్రలు చేయగలరా? అని మోత్కుపల్లి నర్సింహులు ప్రశ్నించారు. గత 70 ఏళ్లలో ఎంత మంది దళితులు ఆయన ఇంటి ముందు చెప్పులు వేసుకొని నడిచారో రేవంత్ చెప్పగలరా? అని అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దళితబంధు పథకం చాలా గొప్పదని... అలాంటి పథకానికి తూట్లు పొడిచేలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మోత్కుపల్లి విమర్శించారు. దళితులను ముందు వరుసలో నిలుచోబెట్టి రాజకీయాలు చేయడం, దళితుల మీద ప్రేమను ఒలకబోస్తూ రాజకీయ ప్రయోజనం పొందాలనుకోవడాన్ని తాను ఖండిస్తున్నానని అన్నారు. రేవంత్ వైఖరిని నిరసిస్తూ ఆదివారం రోజున బేగంపేటలోని తన నివాసంలో ఒకరోజు దీక్షను చేపట్టనున్నానని చెప్పారు. ఉదయం లిబర్టీ చౌరస్తాలో అంబేద్కర్ చౌరస్తాకు నివాళి అర్పించి, ఆ తర్వాత ఇంటికి వెళ్లి దీక్షలో కూర్చుంటానని తెలిపారు. 

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ప్రస్తుతం ఆయనకు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న మల్లారెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు అందరూ గతంలో తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేసిన వారే. అందుకే తమకు కొరకరాని కొయ్యగా మారిన రేవంత్ రెడ్డిపైకి పాత టీడీపీ నేతలను సీఎం కేసీఆర్ ఉసిగొల్పుతున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వస్తోంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu