విచ్చలవిడిగా డబ్బు..హుజురాబాద్ ఉప ఎన్నిక రద్దు?

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోంది. ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బులు పంపిణి జరుగుతోంది. ఓటుకు 10 వేల రూపాయలు ఇస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కవర్లలో డబ్బులు పెట్టి పంచుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. పలు ప్రాంతాల్లో తమకు డబ్బులు ఇవ్వడం లేదంటూ ఓటర్లు రోడ్డెక్కి ఆందోళనలు కూడా చేస్తున్నారు. హుజురాబాద్ లో నెలకొన్న పరిస్థితులపై ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హుజురాబాద్ లో ఎన్నికలను అపహాస్యం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప  ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో పోరాటం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.  కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర ను కలిసి విజ్ఞప్తి చేయనుంది.  ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి  దాసోజు శ్రవణ్, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు కుసుమ కుమార్, హర్కర వేణుగోపాల్ తదితర తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సీఈసీని కలవబోతున్నారు. 

అడ్డగోలుగా అక్రమాలు, ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తూ హుజురాబాద్ లో ఓటర్లను టిఆర్ఎస్, బీజేపీ పార్టీలు కొనుగోలు చేస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇందుకు తగిన ఆధారాలను సీఈసీకి సమర్పించబోతోంది.ఓటుకు 6 వేల రూపాయల నుంచి 10 వేల వరకు డబ్బులు ఇచ్చి ఓట్లను కొనుగోలు చేస్తున్నారని ఆధారాలతో ఫిర్యాదు చేయనున్నారు కాంగ్రెస్ నేతలు. బహుమతులు, ప్రలోభాలు, ఓట్ల కొనుగోలు, అధికార దుర్వినియోగం తదితర అక్రమాలు జరిగాయని ఆరోపణ..

మూడు గంటల్లో లక్షన్నర మంది ఓటర్లకు 90 కోట్ల రూపాయలు పంపిణీ జరిగిందని, ఇంత ఘోరంగా విచ్చలవిడిగా అడ్డగోలు అక్రమాలు, ఎన్నికల నిబంధనల అతిక్రమణలు ఎక్కడా జరగలేదని ఆరోపణ లతో ఫిర్యాదు చేయనున్నరు.  కాంగ్రెస్ నేతల ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది. ఈనెల 30న హుజురాబాద్ పోలింగ్ జరగనుంది.