జగన్ ప్రభుత్వ రికార్డుల ధ్వంసం జరుగుతోంది

ఆమధ్య తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన రోజున, ఆ ప్రభుత్వం చేయించిన ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించిన హార్డ్ డిస్క్లులు, ఆధారాలు ధ్వంసం చేయడం జరిగింది కదా.. అదే తరహాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ‘ధ్వంసం’ కార్యక్రమం ‘ఈ-ఆఫీస్ అప్‌గ్రేడ్’ రూపంలో జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ‘ఈ-ఆఫీస్’ని మూసేశారు. మే 17 నుంచి 25 వరకు  ‘అప్‌గ్రేడ్’ చేసే నెపంతో ఈ-ఆఫీస్‌ని మూశారు. ఈ వ్యవహారంపై తెలుగుదేశం అధినేత  చంద్రబాబు నాయుడు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కి చంద్రబాబు లేఖ రాశారు. త్వరలో కొత్త ప్రభుత్వం వస్తున్నందున, ఆ అప్ గ్రేడ్ వ్యవహారాన్ని కొత్త ప్రభుత్వం చూసుకుంటుందని, ఈ ప్రభుత్వమే అప్‌గ్రేడ్ చేయడం వల్ల అక్రమాలు జరిగే అవకాశం వుందని చంద్రబాబు ఆ లేఖలో రాశారు. ఇలా ఈ-ఆఫీస్‌ని అప్‌గ్రేడ్ చేయడం వల్ల జగన్ ప్రభుత్వం చేసిన అక్రమాలు సమాధి అయ్యే ప్రమాదం వుంది.