ప్రభుత్వంపై వైకాపా యుద్దాలు అందుకేనా?
posted on Nov 22, 2014 8:43AM
చంద్రబాబు నాయుడు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారం చెప్పట్టక ముందు నుండే కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టులు, ప్రత్యేక హోదా తదితర అంశాల గురించి ఒత్తిడి తెచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఐదు నెలల కాలంలో ఆయన చాలా సార్లు ఇదేపని మీద డిల్లీ వెళ్లి వచ్చేరు. మొన్న కూడా మరోమారు అదే పనిమీద మళ్ళీ డిల్లీ వెళ్లి వచ్చేరు. ఒకవైపు కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే మరోవైపు దేశ విదేశాల నుండి పరిశ్రమలను, పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలు కూడా ముమ్మురంగా చేస్తున్నారు. క్రిందటి వారం సింగపూర్ మళ్ళీ త్వరలో జపాన్ పర్యటనలు కూడా దానికోసమే.
అదేసమయంలో రాష్ట్రంలో కొత్తగా భారీ పరిశ్రమల స్థాపనకు అవసరమయిన భూములను రాష్ట్ర పారిశ్రామిక మౌలికవసతుల కల్పన సంస్థ(ఎ.పి.ఐ.ఐ.సి.)కు భూములు బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. చిత్తూరు శ్రీసిటీ పారిశ్రామిక ప్రాంతంలో హీరో మోటార్ సైకిల్స్ తయారీ సంస్థకు, నెల్లూరులో సర్వేపల్లి పారిశ్రామిక వాడలో ‘క్రిషభ్ కో’ మరియు ఒక వ్యవయసాయ పరికారల ఉత్పత్తి సంస్థ నిర్మాణానికి అవసరమయిన భూములను ఎ.పి.ఐ.ఐ.సి.కి బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరులోనే కంటైనర్ కార్పోరేషన్ సంస్థకు అవసరమయిన భూములను కూడా కేటాయించేందుకు పనులు చురుకుగా జరుగుతున్నాయి.
ఇటీవల సింగపూర్ పర్యటించి వచ్చిన చంద్రబాబు నాయుడు ఆదేశం నుండి రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రాబోతున్నట్లు ప్రకటించారు కూడా. అయితే రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి రెండు ప్రధాన అవరోధాలు కనబడుతున్నాయి. 1. రాష్ట్రానికి ఇంకా ప్రత్యేక హోదా రాకపోవడం. 2. భూముల కొరత. అందుకే ప్రత్యేక హోదా కోసం ఆయన పదేపదే కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తెస్తున్నారు. ఈవిషయంలో కొంత జాపం జరిగినప్పటికీ, ఈ ఒత్తిడి కారణంగా ఇప్పుడు కేంద్రంలో కూడా కదలిక మొదలయింది. ఇటీవల కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సంబంధిత శాఖలకు చెందిన ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించి, వీలయినంత త్వరగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేందుకు అవసరమయిన చర్యలు చేప్పట్టాలని ఆదేశించారు. ఆమెతో సమావేశమయిన కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజు ఇరువురు కూడా త్వరలోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందనే నమ్మకం వ్యక్తం చేసారు.
ఇక రెండవ సమస్య అయిన భూసేకరణ సమస్యను పరిష్కరించేందుకు చంద్రబాబు నాయుడు తను అధికారం చేప్పట్టిన కొద్ది రోజులకే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే గత ప్రభుత్వాలు కొంతమంది వ్యక్తులకు, సంస్థలకు నిబంధనలు తుంగలో త్రొక్కి అడ్డుగోలుగా కట్టబెట్టిన భూములను గుర్తించేందుకు మంత్రులతో కూడిన ఒక ఉప కమిటీని వేసారు. అది గుర్తించిన భూములను స్వాధీనం చేసుకోవడం ద్వారా ప్రభుత్వానికి వేల ఎకరాలు అందుబాటులోకి వస్తున్నాయిప్పుడు. అయితే ఆ భూముల వ్యవహారంలో ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించలేని ప్రధాన ప్రతిపక్షం వైకాపా, ప్రభుత్వం తన హామీలను అమలు చేయడంలేదంటూ వచ్చే నెల ఐదవ తేదీ నుండి ధర్నాలు, మహా ధర్నాలకు సిద్దం అవుతోంది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను ఇచ్చిన ప్రతీ హామీని కూడా తప్పకుండా నేరవేర్చుతానని పదేపదే మీడియాముఖంగా చెపుతున్నారు. అంటే ఈ విషయంలో ఒకవేళ ఆయన మాట తప్పాలన్నా తప్పించుకోలేరని స్పష్టమవుతోంది. ఆయనకు ఆ ఉద్దేశ్యం లేదు కనుకనే మీడియా ముఖంగా చెపుతున్నారని అర్ధమవుతోంది. ఆర్ధిక సమస్యలను అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. కానీ వైకాపా మాత్రం అదేమీ గమనించనట్లు ప్రభుత్వాన్ని నిలదీయాలని ఒర్రూతలుగుతోంది. దానికి ప్రజలు మద్దతు ఇస్తారో లేక కొర్రు కాల్చి వాతలు పెడతారో వేచి చూడాలి.