ఓడలు బళ్ళయితే...వికృత రాజకీయ క్రీడలో రూల్స్ మారవు

 

అధికారంలో ఉన్నంత కాలం రాజకీయ నాయకులు తాము శాశ్వితంగా అధికారంలో ఉంటామని, అందువలన ఇక తామే పనిచేసినా అడిగేవారు ఉండరని భావిస్తూ తమకు నచ్చినట్లు వ్యవహరిస్తుంటారు. నిర్ణయాలు తీసుకొంటుంటారు. కానీ ఎన్నికలలో ఓడిపోగానే వారి కలల సామ్రాజ్యం ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. అంతవరకు తాము ఎవరితో చెలగాటం ఆడుకొన్నారో వారే తమతో చెలగాటం ఆడటం మొదలుపెట్టినప్పుడు, అంతవరకు ప్రతిపక్షాలతో తాము ఆడిన ఆటలు మరిచిపోయి, అధికార పార్టీ తమపై కక్ష గట్టి వేధింపులకి పాల్పడుతోందని గగ్గోలు పెట్టడం మొదలుపెడతారు.

 

దేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా చాలా దశాబ్దాలుగా ఈ వికృత రాజకీయ క్రీడను ఆడుకొంటున్నాయి. ఇంతకు ముందు యూపీయే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలతో ముఖ్యంగా బీజేపీతో కాంగ్రెస్ పార్టీచెలగాటమాడింది. చివరికి తనకు బయటి నుండి మద్దతు ఇస్తున్న సమాజ్ వాది, బహుజన్ సమాజ్ వాదీ పార్టీల చెయ్యి మెలికపెట్టి మరీ వారు తనకు మద్దతు కొనసాగించేలా చేసుకొంది. అయితే కాంగ్రెస్ హస్తాన్నే మెలిపెట్టి ఒక ఆట ఆడించిన తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమత బెనర్జీ మళ్ళీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పంచన చేరే ప్రయత్నం చేయడం విశేషం.

 

 

మోడీ ప్రభుత్వాన్ని నిలువరించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల డిల్లీలో బీజేపీయేతర పార్టీలన్నిటినీ కూడదీసి ఒక సమావేశం నిర్వహించింది. దానికి మమతా బెనర్జీ కూడా హాజరయ్యారు. కనుకనే మోడీ సీబీఐను తన యంపీల మీద ప్రయోగించి అరెస్టులకు పాల్పడుతూ తనను, తన ప్రభుత్వాన్ని వేధిస్తున్నారని మమతా బెనర్జీ ఆక్రోశించారు. అయితే తాను ఇటువంటి బెదిరింపులకి భయపడనని, అవసరమయితే అటువంటి సమావేశాలలో మరిన్నిసార్లు పాల్గొంటానని ఆమె అన్నారు.

 

ఇంతవరకు బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు యంపీలను శారదా స్కాం కేసులో సీబీఐ అరెస్టు చేసింది. అదే పార్టీకి చెందిన మరికొంత మంది పేర్లు కూడా సీబీఐ జాబితాలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తుండటంతో సహజంగానే మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి, దాని వ్యతిరేక ప్రభావం ఉంటాయి గనుకనే ఆమె కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నారు.

 

కానీ కేంద్రంలో తను వ్యతిరేకించే బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక తన పార్టీ నేతలు, యంపీలు ఎటువంటి అవినీతికి పాల్పడినా విచారణ చేయకూడదు, అరెస్టు చేయకూడదు..చేస్తే అది వేధింపుల క్రిందే లెక్క అని మమతా బెనర్జీ వాదన అర్ధరహితం. అదేవిధంగా ప్రస్తుతం అధికారం చేతిలో ఉంది కదా అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయ ప్రత్యర్ధులపై ఏదో ఒక నిందమోపి వేదింపులకు పాల్పడితే మున్ముందు వారికీ అదే పరిస్థితి ఎదురవవచ్చును. అధికారంలో ఉన్నప్పుడు ఈ వికృత రాజకీయ క్రీడ రాజకీయ పార్టీలకి చాలా ఆనందం కలిగించవచ్చును. కానీ ఓడలు బళ్ళు అయినప్పుడు అదే ప్రాణసంకటంగా కూడా మారుతుందని గ్రహిస్తే ఈ వికృత క్రీడకు ఎప్పుడో ముగింపు పలికేవి. కానీ ఇప్పుడు ఈ క్రీడను ఎవరూ ఆపలేని పరిస్థితికి చేరుకొన్నారు కనుక ఇది కొనసాగుతూనే ఉంటుంది. అందువల్ల ఓడలు బళ్ళయినంత మాత్రాన్న ఈ వికృత రాజకీయ క్రీడలో రూల్స్ మారవని రాజకీయ పార్టీలన్నీ గుర్తించుకోవడం మంచిది.