ప్రజా సమస్యలే ఆయుధాలుగా అధికార, ప్రతిపక్షాల యుద్ధం

 

తెలంగాణా రాష్ట్ర శాసనసభా సమావేశాలను మరొక వారం రోజులు పొడిగించే విషయంపై చర్చించేందుకు ఈరోజు అన్ని పార్టీల ప్రతినిధులతో కూడిన బి.ఏ.సి. సమావేశం జరుగబోతోంది. అయితే ఇంతవరకు జరిగిన సమావేశాలలో తెలంగాణా రాష్ట్రాన్ని వేదిస్తున్నతీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు, ఆత్మహత్యలు చేసుకొంటున్న రైతులను కాపాడేందుకు, ఇతర ప్రజా సమస్యల పరిష్కారానికి సభలో ఏమయినా పరిష్కారాలు కనుగొన్నారా? అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఏమయినా చర్చించారా? అని ప్రశ్నించుకొంటే లేదనే చెప్పుకోవలసి ఉంటుంది. అలాగని సభలో ప్రజాసమస్యలపై లోతయిన చర్చ జరగలేదని చెప్పడానికి కూడా లేదు. వివిధ సమస్యలపై చర్చించిన ప్రజా ప్రతినిధులు వాటిపై తమకు పూర్తి అవగాహన ఉందని, వాటికి తగిన పరిష్కారమార్గాలు సూచించగల సమర్ధులని కూడా నిరూపించుకొన్నారు. అంటే సమస్యలున్నాయని అందరికీ తెలుసు. వాటిని ఏవిధంగా పరిష్కరించవచ్చో కూడా అందరికీ తెలుసని స్పష్టమవుతోంది. కానీ వారు ప్రజా సమస్యలపై చర్చించి, పరిష్కారాలు కనుగొనే ప్రయత్నాలు చేసే బదులు, అవే సమస్యలను ఆయుధాలుగా చేసుకొని సభలో వాగ్వాదాలు, పరస్పర ఆరోపణలు, విమర్శలు ప్రతివిమర్శలు చేసుకోవడానికే తమ విలువయిన సమయాన్ని, తెలివితేటలను వినియోగించడం ప్రజల దురదృష్టమనే చెప్పుకోవలసి ఉంటుంది.

 

అధికార, ప్రతిపక్షాల వారిగా విడిపోయిన ప్రజాప్రతినిధులు ఆ సమస్యలను అడ్డుపెట్టుకొని ఒకరిపై మరొకరు ఎదురుదాడి చేసుకొంటూ సభలో తమ ప్రత్యర్ధులపై పైచేయి సాధించడానికి తీవ్రంగా ప్రయత్నించారు తప్ప ఆ సమస్యల పరిష్కారానికి చూపలేదు. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీకి చెందిన డి.కే. అరుణ కనిమెట్ట అనే గ్రామంలో పెన్షన్ దక్కక అవస్థలు పడుతున్న వృద్ద దంపతుల గురించి ప్రస్తావించారు. అయితే ఆమె వారి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించే బదులు, తమ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్ని లక్షలమందికి పెన్షన్లు ఇచ్చేమో గణాంకాలు వివరించే ప్రయత్నం చేయడంతో, ఆమె లేవనెత్తిన వృద్ధుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తారనుకొన్న మంత్రి కేటిఆర్ తమ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన దాని కంటే ఐదింతలు ఎక్కువ మొత్తం పెన్షన్ ఇస్తోందని, దేశంలో కెల్లా అత్యధిక పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం తమదేనంటూ గొప్పలు చెప్పుకొన్నారు. ఆ విధంగా ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు చాలా గట్టిగా ప్రయత్నించారు తప్ప ఆ వృద్ధ దంపతుల సమస్యను మాత్రం పరిష్కరించలేకపోయారు.

 

రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న అనేక సమస్యల పట్ల అధికార, ప్రతిపక్షాలు ఇదేవిధంగా వ్యవహరించాయి తప్ప వాటి పరిష్కారానికి మాత్రం ప్రయత్నించలేదనే చెప్పక తప్పదు. బీజేపీకి చెందిన డా. లక్ష్మణ్ విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు చక్కటి ప్రత్యామ్నాయాలు సూచించారు. కానీ వాటిని పట్టించుకొన్నవారు లేరు.

 

ప్రతిపక్షం అంటే ప్రభుత్వం చేసే ప్రతీ పనిని విమర్శించాలి. అధికార పార్టీ అంటే ప్రతిపక్షాల నోరు నొక్కి సభను నడిపించాలి అన్నట్లు వ్యవహరించారే తప్ప ఎవరూ కూడా తాము చర్చిస్తున్న ప్రజా సమస్యలను ఏవిధంగా పరిష్కరించాలి? అని మాట్లాడకపోవడం విచిత్రం. అటువంటప్పుడు ఈ సమావేశాలు మరో వారం రోజులపాటు పొడిగించినా దాని వలన ప్రయోజనం ఏముంటుంది? ప్రజలకు ఒరిగేదేముంటుంది?

 

ప్రజలు రాజకీయంగా చాలా చైతన్యంగా ఉన్నారనే సంగతి మరిచిపోయి, రాజకీయ పార్టీలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించినందుకు సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు వారికి తగిన గుణపాటం నేర్పారు. అయినా రాజకీయ పార్టీలు మేల్కొనకపోతే ప్రజలే వారిని మేల్కొలపవలసి వస్తుంది.