ఏపీ క్యాబినేట్ సమావేశం.. మంత్రులపై చంద్రబాబు గుస్సా..

 

నిన్న ఏపీ క్యాబినేట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో పలు అంశాలపై కాబినేట్ చర్చించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బాక్సైట్ తవ్వకాలపై చర్చించగా.. దీనిపై చంద్రబాబు మంత్రులపై కాస్తంత అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి ఎవరు అనుమతి ఇచ్చారంటూ ప్రశ్నించిన చంద్రబాబు. ఈ విషయంపై మీకు సమాచారం ఉందా అని అటవీశాఖామంత్రి బొజ్జట గోపాల కృష్ణారెడ్డితో పాటు.. మరో మంత్రి గంటా శ్రీనివాసరావును ప్రశ్నించగా.. తమకు ముందుగా తెలీదని చెప్పటంతో బాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ బాక్సైట్ తవ్వకాలపై గిరిజనులు వ్యతిరేకత చూపించిన నేపథ్యంలో వారికి గిరిజనుల మనోభావాల్నిదెబ్బ తీసే ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోకూడదని అదే సమయంలో బాక్సైట్ తవ్వకాల్ని నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు.

అంతేకాదు రెండు రోజుల నుండి ఏపీ లోని పలుజిల్లాల్లో  ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. ఈవిషయంపై కూడా చంద్రబాబు మంత్రులపై ఫైర్ అయినట్టు తెలుస్తోంది. వరదల సమయంలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించాల్సింది పోయి.. ఊరికే ఉండిపోవటం ఏమిటని మంత్రులు దేవినేని ఉమ.. చినరాజప్పపై మండిపడ్డారు. మొత్తానికి ప్రశాంతంగా జరగాల్సిన క్యాబినెట్ సమావేశం చాలా సీరియస్ గా జరిగినట్టు తెలుస్తోంది.