కేంద్రమంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుకి మరో కీలక పదవి

ప్రతిభ, సామర్ధ్యం ఉంటే పదవులు హోదాలు వాటంతట అవే వచ్చి చేరతాయనడానికి నిలువెత్తు నిదర్శనంగా కేంద్ర మంత్రి కింజారపు రామ్మెహన్ నాయుడు నిలుస్తారు. తండ్రి కింజరపు ఎర్రన్నాయుడి మరణంతో తండ్రివారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన రామ్మోహన్ నాయుడు  అనతి కాలంలోనే తండ్రికి మించిన తనయుడిగా తనదైన ముద్ర వేశారు.  

2014, 2019, 2024లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో   వరుసగా శ్రీకాకుళం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. అత్యంత పిన్న వయస్సులోనే కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అదీ పౌరవిమానయాన శాఖ మంత్రిగా తనదైన ముద్ర వేస్తున్నారు.  లోక్ సభలో తన అనర్గళ ప్రసంగాలతో అందరి దృష్టీ ఆకర్షిస్తున్నారు.  పార్లమెంట్లో రామ్మోహన్నాయుడి పనితీరు  ఆధారంగా 2020లో సంసద్ రత్న 'జ్యూరీ కమిటీ స్పెషల్ అవార్డు’ అందుకున్నారు.  అతి చిన్న వయస్సులోనే సంసద్ రత్న అవార్డు అందుకున్న రికార్డును సొంతం చేసుకున్నారు.

తాజాగా ఢిల్లీలో జరుగుతున్న  2వ ఆసియా-పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్‌లో సభ్య దేశాల ఛైర్మన్ ఎన్నిక బుధవారం (సెప్టెంబర్ 11) జరిగింది. ఆ ఎన్నికలో  ఆసియా ఫసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్  ఛైర్మన్‌గా కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  అంటే 40 సభ్య దేశాల ప్రతినిధులు రామ్మోహన్ నాయుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారన్న మాట. దేశం తరఫున తనకు దక్కిన ఈ గౌరవాన్ని బాధ్యతతో స్వీకరిస్తున్నట్లు పేర్కొన్న కింజారపు విమానయాన రంగాన్ని ప్రజలకు చేరువగా తీసుకురావడంతో పాటు ఆసియా ఫసిఫిక్ దేశాల మధ్య రవాణాను సులభతరం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.