బంగ్లాదేశ్ లో మరో హిందూ యువకుడి హత్య
posted on Dec 26, 2025 6:05AM

బంగ్లాదేశ్ లో హిందువులే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆ దేశంలో దీపూ చంద్ర దాస్ దారుణ హత్య మరవకముందే, రాజ్‌బర్ జిల్లాల్లో మరో హిందూ యువకుడిని గ్రామస్థులు కొట్టి చంపిన ఘటన వెలుగు చూసింది. బుధవారం (డిసెంబర్ 24 రాత్రి ఈ దారుణం జరిగింది.
రాజ్‌బర్ జిల్లాలోని పంగ్షా సర్కిల్‌లో 29 ఏళ్ల అమృత్ మొండల్ అలియాస్ సామ్రాట్‌పై బుధవారం రాత్రి గ్రామస్థులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే అమృత్ మొండల్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించాడు. అమృత్ మండల్ సామ్రాట్ బహిన్ అనే సంస్థను నిర్వహిస్తున్నాడు. అయితే అతడు ఆ సంస్థ పేరిట సొమ్ములు వసూలు చేస్తూ, దౌర్జన్యాలకూ, హింసాకాండకూ పాల్పడుతున్నాడన్న అభియోగాలు ఉన్నాయి.
అతడిపై హత్యా నేరం సహా రెండు కేసులు ఉన్నాయి. అదలా ఉంచితే గత కొంత కాలంగా అజ్ణాతంలో ఉన్న అమృత్ మొండల్ ఇటీవలే గ్రామానికి తిరిగి వచ్చాడు. ఈ నేపథ్యంలోనే అతడిపై దాడి జరిగింది. ఇదలా ఉండగా హిందువులు లక్ష్యంగా బంగ్లాదేశ్ లో దాడులు కొనసాగుతున్నాయి. గత ఐదు రోజుల వ్యవధిలో బంగ్లాదేశ్ లో హిందువులకు కుటుంబాలు లక్ష్యంగా ఏడు దాడులు జరిగాయి. ఏడు గృహాలు దగ్ధమయ్యాయి.