వల్లభనేని వంశీ.. వెంటాడుతున్న గత పాపాలు.. తాజాగా మరో కేసు
posted on Dec 18, 2025 9:41AM
.webp)
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని కేసులు వదలడం లేదు. ఇప్పటికే ఆయనపై దాడి, దౌర్జన్యం, భూ కబ్జా ఇలా పలు కేసులు నమోదై ఉన్నాయి. గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో జైలుకు వెళ్లి బెయిలుపై బయటకు వచ్చారు. వల్లభనేని వంశీ దాదాపు 140 రోజులు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పటికే వంశీ మొత్తం 11 కేసులలో నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై తాజాగా మరో కేసు నమోదైంది. విజయవాడ మాచవరం పోలీసు స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. వంశీ తన అనుచరులతో కలిసి తనపై గత ఏడాది జులైలో దాడికి పాల్పడ్డారంటూ సునీల్ అను వ్యక్తి ఫిర్యాదు మేరకు వల్లభనేని వంశీపై తాజాగా మాచవరం పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది.
జగన్ హయాంలో దాడులు, దౌర్జన్యాల, కబ్జాలు, అనుచిత వ్యాఖ్యలతో దూషణలతో చెలరేగిపోయిన వల్లభనేని వంశీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సైలెంటైపోయారు. కేసుల భయంతో వణికిపోయి దాదాపుగా అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టేందుకు కూడా జంకుతున్న పరిస్థితి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంకా వైసీపీలో ఉన్నారా? అసలు రాజకీయాలలో ఉన్నారా? అంటూ వైసీపీ శ్రేణులే సందిగ్ధంలో ఉన్న పరిస్థితి.
కోర్టు ఆదేశాల మేరకు వల్లభనేని వంశీ గన్నవరం సమీపంలోనే నివాసం ఉంటున్నా వైసీపీ నేతలను, కార్యకర్తలను కలవడం లేదు. వారిని కనీసం తన ఇంటి ఛాయలకు కూడా రానీయడం లేదంటున్నారు. కానీ ఇదే వంశీ.. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం కబ్జాలు, దాడులు, దౌర్జన్యాలతో చెలరేగిపోయారు. తెలుగుదేశం అగ్రనాయకులు, వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. ఇప్పుడు సైలెంటైపోయినంత మాత్రాన కర్మ వదులుతుందా? అంటే వదలదని ఆయనపై నమోదైన కేసులు చెబుతున్నాయి. తాజాగా వంశీపై మరో కేసు నమోదైంది.