యూ ఆర్ ఇన్ క్యూ.. వైసీపీలో ఎనౌన్స్ మెంట్ ఫోబియా
posted on Mar 28, 2025 3:11PM

వైసీపీ అధినేత మొదలుకుని నేతల వరకు అందరూ క్యూలో
మనం ఏదైనా పని మీద కస్టమర్ కేర్ నెంబర్లకు ఫోన్ చేస్తే.. యూ ఆర్ ఇన్ క్యూ.. అనే ఎనౌన్స్ మెంట్ వస్తుంది. దీంతో మన సమయం వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం. ఇదే ఎనౌన్స్ మెంట్ ఇప్పుడు వైసీపీ నేతల చెవుల్లో మార్మోగుతోంది. మెలకువగా ఉన్నా.. కళ్లు మూసుకుని పడుకున్నా.. యూ ఆర్ ఇన్ క్యూ.. అనే ఎనౌన్స్ మెంటే తెగ వినిపిస్తోంది. దీంతో కొందరు వైసీపీ నేతలు ఎనౌన్స్ మెంట్ ఫొబియాతో అల్లాడుతున్నారట. అవును.. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే చర్చ జరుగుతోంది. సజ్జల రామకృష్ణా రెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి, మిధున్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విక్రాంత్ రెడ్డి, మాజీ మంత్రులు కొడాలి నాని, కాకాణి గోవర్దన్ రెడ్డి, పేర్ని నాని, జోగి రమేష్, పెద్దిరెడ్డి, విడదల రజనీ, రోజా, వెలంపల్లి, అనిల్ కుమార్ యాదవ్ ఇలా ఒకరి తర్వాత మరొకరు.. జైలుకు వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
క్వార్ట్జ్ గనులకు సంబంధించి అక్రమాలు భారీ ఎత్తున జరిగాయనే అభియోగాలపై మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి మెడపై కత్తి వేలాడుతోంది. నెల్లూరు జిల్లాలో భారీగా గనుల్లో అక్రమాలకు పాల్పడ్డారని.. మాజీ మంత్రి సోమిరెడ్డి గత ఐదేళ్ల కాలంలో పెద్ద ఎత్తున పోరాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ స్థాయిలో అయితే నాటి మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై అలుపెరగని పోరాటం చేశారో.. అధికారం వచ్చిన తర్వాత కూడా సోమిరెడ్డి పట్టు వదలని విక్రమార్కుడు లెక్కే వెంటబడ్డారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గత ఐదేళ్ల కాలంలో వెలుగులోకి వచ్చిన చాలా కుంభకోణాలు.. అక్రమాలన్ని సోమిరెడ్డి లైమ్ లైటులోకి తెచ్చినవేననడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు కాకాణి మీదున్న కేసులు ఒక్కొక్కటీ కొలిక్కి వస్తున్నట్టే కన్పిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కాకాణి అరెస్ట్ మీద విపరీతంగా చర్చ జరుగుతోంది.
అలాగే మద్యం కుంభకోణం విషయంలో మిధున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి వంటి వారు జైలుకు వెళ్తారనే ప్రచారమూ జోరుగా ఉంది. ఏపీలో వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం విషయం ఇప్పటికే జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పార్లమెంటులో ప్రస్తావించడం.. ఆ తర్వాత అమిత్ షాను కలవడంతో ఏపీలోని మద్యం స్కాం ఒక్కసారిగా జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పైగా ఆ కేసు రాజకీయంగా కూడా చాలా చర్చకు దారి తీయడంతో.. ఢిల్లీ పొలిటికల్ సర్కిల్సులో హాటా టాపిక్ గా మారింది. అలాంటి పరిస్థితుల్లో ఏకంగా 18 నుంచి 20 వేల కోట్ల రూపాయల మద్యం స్కాం ఏపీలో జరిగిందంటే.. ఢిల్లీ పెద్దలు సహజంగానే దానిపై ఆరా తీస్తారు. ఈ పరిణామంతో ఏపీ మద్యం స్కాం కచ్చితంగా ఈడీకి చేరుకుంటుందని ఢంకా బజాయించి మరీ చెప్పొచ్చు. ఈ మద్యం స్కాం కేసులు.. విచారణ నేపథ్యంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఆయన కుమార్డు మిధున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వంటి వారితో పాటు.. ఏకంగా ఈ లింకులు తాడేపల్లి ప్యాలెస్ వైపు దారి తీస్తుండడంతో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ చుట్టూ కూడా మద్యం ఉచ్చు బిగిసుకునే సూచనలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఇవాళ కాకున్నా రేపు.. రేపు కాకున్నా ఎల్లుండైనా.. మద్యం స్కాంలో వైసీపీలోని పెద్దల పీఠాలు.. ఆ పార్టీ కూసాలు కదలడం ఖాయమనే చర్చ యమ జోరుగా సాగుతోంది.
వీరు కాకుండా.. కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్, రోజా, విడదల రజనీ వంటి వారిపై ఇప్పటికే కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మీద ఎలాంటి కేసూ నమోదు కాలేదు. అయితే వెలంపల్లి కూడా క్యూలో ఉన్నారని తెలుస్తోంది. దేవదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు.. వెలంపల్లి.. ఆయన అనుచరులు దేవదాయ శాఖలో చాలా అక్రమాలకు పాల్పడ్డారని ప్రభుత్వానికి సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. దేవదాయ శాఖకు చెందిన వివిధ భూముల్లో భారీగా అక్రమాలకు తెరలేపారట వెల్లంపల్లి. కొన్ని భూములకు నిబంధనలకు విరుద్దంగా ఎన్వోసీలు ఇవ్వడం వంటివి చేసినట్టు ఆధారాలు కూడా ఉన్నాయనేది తెలుస్తోంది. దీంతో వెలంపల్లి మీద కేసు నమోదు చేయడానికే కాదు.. ఏకంగా శ్రీ కృష్ణ జన్మ స్థానానికి పంపడానికి అవసరమైన ఆధారాలు ఉన్నాయనేది ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఈ క్రమంలో త్వరలోనే వెలంపల్లి మీద కూడా కేసు నమోదయ్యే ఛాన్స్ చాలా స్పష్టంగా కన్పిస్తోంది. దీంతో అనిల్ కుమార్ యాదవ్ మీదున్న అభియోగాలను తెరపైకి తెచ్చేందుకు రంగం సిద్దమవుతోందని సమాచారం.
హడావుడిగా కాకుండా.. అన్ని ఆధారాలు సేకరించే పని మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు కన్పిస్తోంది. ఆధారాలు లభ్యమైన తర్వాతే కేసులను బిల్డప్ చేయడంతో పాటు.. తప్పు చేసిన వారు తప్పించుకుపోవడానికి ఎలాంటి ఆస్కారం లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఈ సమాచారం ఇప్పుడు ఏపీలోని పొలిటికల్ సర్కిల్సులో విస్తృతంగా ప్రచారంలో ఉంది. దీంతో వైసీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు నెమ్మదిగా జైలుకు వెళ్లడం ఖాయమనే భావన చాలా మందిలో కన్పిస్తోంది. దీనికి తగ్గట్టుగానే కొందరు వైసీపీ నేతలైతే జైలుకు వెళ్లడానికి మానసికంగా ప్రిపేరైనట్టే కన్పిస్తున్నారు.