ఏపీలో 51 కరవు మండలాలు

గత ఏడాది ఏపీలో సాధారణ స్థాయి వర్షపాతం నమోదు కాలేదు అయినా కూడా గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కరువు మండలాల ప్రకటన సరిగా జరగలేదు. ఎదో మొక్కుబడి తంతుగా జగన్ సర్కార్ నాడు కరువు మండలాలను ప్రకటించి ఊరుకుంది.అయితే కూటమి సర్కార్ రైతుల ఇబ్బందులు, సమస్యలు, అలాగే స్థానిక పరిస్థితులు అన్నిటినీ పరిగణనలోనికి తీసుకుని కరువు మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. తాజాగా ఏపీలోని ఆరు జిల్లాల్లో 51 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది.

ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక సీఎస్ ఆర్పీ సిసోడియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రకటించిన 51 మండలాల్లో 37 మండలాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నట్లు పేర్కొన్నారు.  అందుకు అనుగుణంగా 2024-25 సంవత్సరానికి కరువు మండలాలను వెల్లడిస్తూ ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు  జారీ చేశారు. ఇటీవల రాష్ట్ర విపత్తుల నిర్వహణ కార్యాలయంలో నిర్వహించిన కరువు ప్రభావ కమిటీ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖలు సమర్పించిన నివేదికలను నిశితంగా పరిశీలించి వివిధ జిల్లాల నుంచి వచ్చిన నివేదికలను తాము దృష్టిలో ఉంచుకుని, వర్షపాతం లోటు, పంటల నష్టం, భూగర్భ జలాల స్థాయి, వ్యవసాయ  స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని కరువు మండలాలను ప్రకటించింది కూటమి ప్రభుత్వం.