తెలుగువారి దివ్యౌషధం నేలవేము..
posted on Apr 29, 2019 9:41AM
సారాసారము లెఱుగని బేరజులకు బుద్ధిజెప్పబెద్దలవశమా?
నీరెంత పోసి పెంచినగూరగునా నేలవేము?గువ్వలచెన్నా!
అని గువ్వలచెన్న శతకంలో ఓ పద్యం ఉంది. ఎంత నీరు పోసినా పెంచినా కూడా నేలవేములో చేదు తగ్గడం ఎలా అసాధ్యమో.... మంచీచెడూ విచక్షణ ఎరుగని ధూర్తులకు బుద్ధి చెప్పాలనుకోవడం అంతే నిరుపయోగం అని ఈ పద్యంలోని అర్థం. దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితం రాసిన ఈ పద్యంలో నేలవేము అనే మొక్క గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. ఇంతకీ ఏమిటా నేలవేము అని తరచిచూస్తే కళ్లు చెదిరే వాస్తవాలు ఎన్నో వినిపిస్తాయి.
కటిక నేల మీదైనా :
నేలవేము ఆసియాకే ప్రత్యేకమైన ఓ చిన్న మొక్క. మొదట్లో ఇది దక్షిణభారతంలోనే కనిపించేదట. దీని ఔషధగుణాలు తెలిసిన తరువాత ప్రపంచమంతటా దీనిని పెంచడం మొదలుపెట్టారు. ఎలాంటి నేలలో అయినా, ఎలాంటి కాలంలో అయినా పెరిగే సత్తా ఉండటంతో దీని పెంచేందుకు ఏమంత శ్రద్ధ వహించాల్సిన పనిలేదు. పైగా వేయి అడుగుల ఎత్తైన పర్వతాల మీద కూడా నేలవేము సులభంగా ఎదిగేస్తుందని తేలింది.
కటిక చేదు
వేము అంటే వేప. నేల మీద పెరిగే చిన్నపాటి మొక్కలలో వేపతో సమానమైన చేదు కలిగి ఉంటుంది కాబట్టి, ఈ మొక్కకి నేలవేము అన్న పేరు వచ్చింది. దీనికి ఉన్న విపరీతమైన చేదుగుణం వల్ల సంస్కృతంలో దీనిని మహాతిక్త అని కూడా పిలుస్తారు. ఆయుర్వేదంలో కాల్మేఘ్ పేరుతో దీనిని విస్తృతంగా వాడతారు. తిక్తక కషాయం, తిక్తఘృతం వంటి మందులెన్నింటినో నేలవేముతో తయారుచేస్తారు.
దేశాన్నే కాపాడిందా!
నేలవేములో ఉండే కటిక చేదే మన ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తుందంటారు వైద్యులు. ఈ విషయాన్ని ఎరిగినవారు కనుకే భారతీయులు వందల ఏళ్లుగా దీనిని గృహవైద్యంలో భాగంగా వాడుతూ వచ్చారు. దీని ఆకులు, వేళ్లని ఎండబెట్టుకుని చూర్ణం చేసుకుని ప్రతి ఇంట్లోనూ ఉంచుకునేవారు. జలుబు చేసినా, జ్వరం వచ్చినా కూడా దీనినే వాడేవారు. అంతదాకా ఎందుకు! 1918 ప్రాంతంలో వచ్చిన ఫ్లూ జ్వరాలు ప్రపంచాన్నంతా చుట్టుముట్టాయి. మన దేశంలో కూడా కోటిమందికి పైగా ఈ జ్వరం బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కానీ ఆ సమయంలో గ్రామగ్రామానా కాల్మేఘ్ ఔషధాన్ని వాడటం వల్ల ఫ్లూ ఉపద్రవం ఉపశమించిందంటారు.
సర్వవ్యాధినివారిణి :
- నేలవేము యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేయడం వల్ల క్షయ, నిమోనియా వంటి వ్యాధులలో ఉపశమనాన్నిస్తుంది.
- ఇందులోని యాంటీ ఫంగల్ గుణాల వల్ల చర్వవ్యాధులలో అద్భుతంగా పనిచేస్తుంది.
- యాంటీ వైరల్ లక్షణాల కారణంగా హెర్పిస్ అనే మొండి సుఖవ్యాధి మీద సైతం ప్రభావాన్ని చూపుతుంది.
- జలుబు వంటి కఫ సంబంధ వ్యాధులలో నేలవేము అద్భుతంగా పనిచేస్తుందని పరిశోధనలలో కూడా రుజువైంది.
- నేలవేము చూర్ణం, కాలేయం పనితీరుని మెరుగుపరిచి కామెర్లని అదుపులో ఉంచుతుందట.
- మలేరియా, చికెన్గున్యా వంటి మొండి జ్వరాలలో సైతం నేలవేము ప్రభావం చూపుతుందని సంప్రదాయ వైద్యులు చెబుతున్నారు.
- గుండె ధమనులు గట్టిపడిపోయే atherosclerosis అనే స్థితిలో నేలవేముని వాడితే ఫలితం దక్కవచ్చు.
- జీర్ణ సంబంధమైన చాలా వ్యాధులలో నేలవేము అద్భుతాలు చేస్తుందన్నది వైద్యుల మాట.
- నేలవేము పెరిగే చోట పాములు, దోమల వంటి విషజీవులు దరిచేరవని అంటారు.
ఇవీ నేలవేముకి సంబంధించిన కొన్ని ఉపయోగాలు. ఇక నేలవేములో ఉండే విపరీతమైన చేదు వల్ల మధుమేహంలో ఇది దివ్యౌషధంగా పనిచేస్తుందనడంలో ఎవరికీ ఎలాంటి సందేహమూ లేదు. అయితే గర్భిణీ స్త్రీలు నేలవేముని వాడటం వల్ల శిశువుకి ప్రమాదం జరిగే అవకాశం ఉందా లేదా అన్న విషయమై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. నేలవేముని వాడటం వల్ల ఎయిడ్స్, క్యాన్సర్ వంటి రోగాలు సైతం అదుపులో ఉంటాయని చెబుతున్నారు కానీ... ఈ నమ్మకంలోని నిజానిజాలు ఇంకా రుజువు కాలేదు.
ఇదీ నేలవేముని గురించి ఓ స్థూల పరిచయం. నేలవేముని వాడటం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారిపోతారని కాదు. కానీ ఇలాంటి ఔషధి ఒకటి ఉండేదని తెలుసుకోవడం వల్ల మన సంప్రదాయ వైద్య విజ్ఞానం మరీ తీసిపారేసేదేమీ కాదని తేలుతుంది. ఆసక్తి ఉంటే మనం కూడా వాటిలో కొన్ని ఆచరణాత్మక పద్ధతులను పాటించే అవకాశం ఉంది. అలా సులువుగా, సమర్ధవంతంగా వాడుకోగల ఔషధులలో నేలవేము ఒకటి.
- నిర్జర.