ప్రత్యేక హోదా కోసం యువకుడు ఆత్మహత్య ప్రయత్నం

 

ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తిరుపతిలో నిర్వహించిన ఒక బహిరంగ సభలో విషాదం చోటు చేసుకొంది. కాంగ్రెస్ పార్టీకే చెందిన కోటి అనే ఒక వ్యక్తి మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి ప్రసంగిస్తున్న సమయంలో సభ వేదిక కి కొద్ది దూరంలో నిలబడి తన ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసాడు. వెంటనే చుట్టూ ఉన్నవారు మంటలు ఆర్పి అతనిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి చాలా విషమంగా ఉందని, మరో మూడు రోజులు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. సుమారు 50 శాతం కాలిన గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు.

 

పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి సభలో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న సమయంలో ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరమని అన్నారు. ఇకపై ప్రత్యేక హోదా కోసం ఎవరూ కూడా ఇటువంటి ప్రయత్నాలు చేయవద్దని ప్రజలను కోరారు. ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్దంగా ఉద్యమించి ప్రత్యేక హోదా సాధిద్దామని ఆయన అన్నారు. ఈ సభ ముగియగానే ఆ యువకుడిని అవసరమయితే చెన్నై లేదా వేలూరుకి తరలించి ఇంకా మంచి వైద్యం అందించుతామని ప్రకటించారు.