వడ దెబ్బ భాదిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

 

ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా ఎండలు మండిపోతున్నాయి. గత 65 సం.లలో ఇంత తీవ్రమయిన ఎండలు చూడటం ఇదే మొదటిసారని వృద్ధులు చెపుతున్నారు. రెండు రాష్ట్రాలలో నిత్యం అనేక మంది వృద్దులు, పిల్లలు, ఎండల్లో పనిచేసే శ్రమజీవులు వడదెబ్బ బారినపడి మృతి చెందుతున్నారు. దీనిపై స్పందించిన ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంచాయతీలు, మున్సిపాలిటీల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉపాధి కూలీల పని వేళల్లో మార్పులు సూచించారు. ఉదయం పదివరకు మళ్ళీ  ఎండ తీవ్రత తగ్గిన తరువాత సాయంత్రం వేళల్లో పనిచేయాలని సూచించారు. వడదెబ్బ తగలకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, వడదెబ్బ తగిలిన తరువాత తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రభుత్వం టీవీలు, పత్రికల్లో విస్తృతంగా ప్రచారం చేస్తోందని, కనుక ప్రజలు కూడా ఆ ప్రకారం తగు జాగ్రత్తలు పాటించాలని హితవు చెప్పారు. వడదెబ్బ కారణంగా మృతి చెందిన కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రకటించారు.