చంద్రబాబు అధ్యక్షతలో నీతి ఆయోగ్ సమావేశం నేడు
posted on May 19, 2015 8:12AM
ఈరోజు చండీఘడ్ లో జరుగబోయే నీతి ఆయోగ్ (ప్రణాళిక సంఘం) సమావేశానికి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించబోతున్నారు. ఇంతవరకు ప్రణాళికా సంఘంలో రాష్ట్రాల పాత్ర నామమాత్రంగానే ఉండేది. ఇంతకు ముందు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఈ లోపాన్ని గుర్తించిన నరేంద్ర మోడీ తను ప్రధానమంత్రి అయిన తరువాత దానిని సరిదిద్దారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు ప్రణాళికా సంఘంలో సమాన ప్రాతినిధ్యం ఉన్నప్పుడే అది ఆశించిన ఫలితాలు ఇస్తుందని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. అందుకే పాత ప్రణాళికా సంఘాన్ని రద్దుచేసి, ఆ వ్యవస్థలో ఉన్న అనేక లోపాలను సవరించి దాని స్థానంలో కొత్తగా ఈ నీతి ఆయోగ్ ని ఏర్పాటు చేసారు. ఈరోజు నీతి ఆయోగ్ సమావేశానికి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించడమే ఆ వ్యవస్థలో జరిగిన మార్పులకి అద్దం పడుతోంది.