ఏపీకి న్యాయం చేయడానికి మీనమేషాలు లెక్కించడం ఎందుకో?
posted on Sep 23, 2015 12:37PM
ఏపీకి ప్రత్యేక హోదా గురించి కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రధానికి వ్రాసిన లేఖకు కేంద్రం నుండి జవాబు వచ్చింది. దానిలో ప్రత్యేక హోదా పొందడానికి అవసరమయిన అర్హతలు, లక్షణాలు, దేశంలో వివిధ రాష్ట్రాల డిమాండ్లు, అభ్యంతరాల గురించి వివరించి ఏపీకి ప్రత్యేక హోదా మంజూరు చేయలేమని తెలియజేసినట్లు సమాచారం.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమనే విషయాన్ని కేంద్రప్రభుత్వం చాలా నెలల క్రితమే స్పష్టం చేసింది. కానీ రాష్ట్ర ప్రజలకి ఆ ముక్కని దైర్యంగా సూటిగా చెప్పేలేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేజేతులా సమస్యలు కొనితెచ్చుకొంటున్నాయి. దీని గురించి కేంద్రాన్ని నిలదీయాల్సిన కాంగ్రెస్, వైకాపాలు తమ పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రమే నిలదీస్తుండటంతో అవి విసురుతున్న సవాళ్ళను ఎదుర్కొంటూ తెదేపా వాటికీ జవాబులు, సంజాయిషీలు చెప్పుకొంటూ తనని తాను కాచుకోవలసివస్తోంది.
ఈ విషయం గురించి కాంగ్రెస్, వైకాపాలు రాష్ట్ర బీజేపీ నేతలను కూడా ప్రశ్నించకుండా కేవలం తెదేపానే లక్ష్యంగా చేసుకొని పోరాడటం గమనిస్తే వారి చిత్తశుద్ధి ఏపాటిదో, వారు ఏ ఉద్దేశ్యంతో పోరాడుతున్నారో అర్ధం అవుతుంది. ప్రత్యేక హోదా వలన రాష్ట్రానికి జరిగే మేలు కంటే అది దక్కకపోవడం వలన ఆ రెండు పార్టీలు మంచి రాజకీయ లబ్ది పొందగలుగుతున్నాయి. మిగిలిన ఏవిషయంలోను అధికార పార్టీపై పైచెయ్యి సాధించలేకపోతున్న వైకాపా ఈ ఒక్క విషయంలోనూ తెదేపా ప్రభుత్వం పైచెయ్యి సాధించి దానితో చెలగాటం ఆడుకోగలుగుతోంది.
ఇదే విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి చాలాసార్లు వివరించి సమస్య పరిష్కారానికి సహకరించవలసిందిగా అభ్యర్దిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేయలేమని కేంద్రప్రభుత్వం స్పష్టం చేస్తునప్పుడు, కనీసం ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి అయినా మంజూరు చేసి ఉండి ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే ప్రజలకు ఏదో విధంగా నచ్చజెప్పుకొనే ప్రయాత్నాలు చేసి ఉండేది. కానీ కేంద్రం చేస్తున్న జాప్యం వలన రాష్ట్రంలో ప్రతిపక్షాలకి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించేందుకు, సమస్యలు సృష్టించేందుకు మంచి అవకాశం లభిస్తోంది.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ క్రిందటి నెల రాష్ట్ర బంద్ చేసిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈనెల 26నుండి గుంటూరులో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో ఇప్పటికే ఆరుగురు వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకొన్నారనే సంగతి తెలిసి ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్న తన పోరాటంలో విజయం సాధించేందుకు జగన్ విద్యార్ధులను రెచ్చగొడుతున్నారు. ఒకవేళ విద్యార్ధులు రంగంలోకి దిగితే ఈ సమస్య మరింత జటిలమవుతుంది. అప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ చింతించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.
బీహార్ రాష్ట్రానికి ఎటువంటి హామీ ఇవ్వనప్పటికీ రూ.1.25లక్షల కోట్లు మంజూరు చేయగలిగినప్పుడు, విభజన చట్టంలో లికిత పూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కేంద్రం వెనకాడితే దానికే నష్టం. అవి తెదేపా, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రజలను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంది. కనుక కేంద్రం ఇంకా మీనమేషాలు లెక్కపెడుతూ కాలక్షేపం చేయకుండా వీలయినంత త్వరగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తి న్యాయం చేయాలి.