జాతీయపార్టీగా ఎదిగేందుకు తెదేపా ముందున్న సవాళ్లు
posted on May 29, 2015 11:42AM
మహానాడు సమావేశాలలో పార్టీ జాతీయ కమిటీ ఏర్పాటు, దానికి అధ్యక్ష ఎన్నికల ప్రక్రియతో తెలుగుదేశం పార్టీని జాతీయపార్టీగా మార్చేందుకు శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం పార్టీని చుట్టుపక్కల అన్ని రాష్ట్రాలలోకి విస్తరించాలని నిర్ణయం జరిగింది.. జాతీయ కమిటీని ఏర్పాటు చేసుకోవడం వరకు పార్టీకి ఎటువంటి సమస్యలు ఉండకపోవచ్చును. కానీ పార్టీని జాతీయ పార్టీగా మార్చి ఇరుగు పొరుగు రాష్ట్రాలలో విస్తరించాలంటే అనేక సమస్యలను అధిగమించాల్సి ఉంటుంది.
అన్నిటి కంటే ముందుగా పార్టీ పేరుతో ఒక చిక్కు ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పేరుతో పార్టీ కొనసాగడానికి ఎటువంటి సమస్యా ఉండబోదు. కానీ తమిళనాడు, కర్నాటక, ఓడిశా, మహారాష్ట్ర, అండమాన్, నికోబార్ దీవులలో పార్టీని విస్తరించాలనుకొంటున్న తెలుగుదేశం అదే పేరుతో తనను తాను అక్కడి ప్రజలకు పరిచయం చేసుకోవడం చాలా కష్టం. మరాఠీ, ఒడియా,కన్నడ, తమిళ్ బాషలు మాట్లాడే ప్రజలను తెలుగుదేశం పేరుతో ఒప్పించడం చాలా కష్టం. అలాగని వారి కోసం పార్టీ పేరును మార్చుకోలేదు. బహుశః ఈ సమస్యను మొదటే గుర్తించిన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ ఎన్టీఆర్ చాలా దూరదృష్టితో ఆలోచించి తెదేపా బదులు ‘భారతదేశం పార్టీ’ అని పేరు పెట్టాలని ఆలోచించారేమో? ఏమయినప్పటికీ ముందుగా ఈ పేరు సమస్యను తెదేపా పరిష్కరించుకోవలసి ఉంటుంది.
ఇక పొరుగు రాష్ట్రాలలో ఇప్పటికే అనేక ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా నిలద్రోక్కుకొని ఉన్నాయి. కనుక తమకు పోటీగా వస్తున్న తెదేపాను ఆ పార్టీలు వ్యతిరేకించవచ్చును. ఉదాహరణకి తమిళనాడులో అధికార అన్నాడీయంకె, ప్రధాన ప్రతిపక్షమయిన డీయంకెలతో బలంగా నిలద్రోక్కుకొని ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీలతో సహా మరొక అరడజను పార్టీలు కూడా ఉన్నాయి. అవ్వన్నీ కూడా ప్రతీ ఎన్నికలలో స్థానిక తెలుగు ప్రజల ఓట్లను పొందుతున్నాయి. ఇప్పుడు తెదేపా ప్రవేశిస్తే వాటికి ఆ ఓట్లన్నీ పోయే అవకాశం ఉంది. కనుక వాటి నుండి వ్యతిరేకత ఎదుర్కోవలసి రావచ్చును. కానీ ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో మాదిరిగానే ఆ రాష్ట్రాలలో కూడా బీజేపీతో కానీ లేదా ఎన్డీయే కూటమిలో ఉన్న పార్టీలతో గానీ లేదా ఏదో ఒక స్థానిక పార్టీతో గానీ పొత్తులు పెట్టుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చును. ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో కూడా కొనసాగాలనే ఉద్దేశ్యంతోనే తెదేపా జాతీయస్థాయికి ‘అప్ గ్రేడ్’ అవ్వాలనుకొంటోంది తప్ప ఆయా రాష్ట్రాలలో ప్రధాన పార్టీలతో పోటీపడి అధికారం కైవసం చేసుకొనే ఆలోచనలేదనే చెప్పవచ్చును. కనుక ఆయా రాష్ట్రాలలో ఏదో ఒక పార్టీతో పొత్తులు పెట్టుకొన్నట్లయితే తెదేపా పెద్దగా ఇబ్బంది లేకుండానే ఇతర రాష్ట్రాలకు విస్తరించగలదు.
ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన పూర్తి సమయం కేటాయించలేకపొతున్నారు. అటువంటప్పుడు మరిన్ని రాష్ట్రాలకు పార్టీని విస్తరించేమాటయితే వాటికీ తగినంత సమయం కేటాయించగలరా? లేకుంటే అక్కడ పార్టీలను ఏవిధంగా బలోపేతం చేసుకోవాలి? ఎటువంటి వ్యూహాలు అమలుచేయాలి? ఆ బాధ్యతలు ఎవరికి అప్పగించాలి? వివిధ రాష్ట్రాలలో పార్టీ శాఖలను, నేతలను పార్టీతో ఏవిధంగా అనుసదానించాలి? వంటి వాటి గురించి కూడా పార్టీ అధిష్టానం ముందుగానే ఆలోచించుకోవలసి ఉంటుంది. అందుకు జాతీయపార్టీలయిన కాంగ్రెస్, బీజేపీలు అమలుచేస్తున్న విధానాలను పరిశీలిస్తే మంచిది.
తెదేపాను ఇతర రాష్ట్రాలకు విస్తరించినప్పుడు ఆయా రాష్ట్రాలలో స్థానిక నేతలతోనే పార్టీని నిర్మించుకోవడం ద్వారా ఈ సమస్యను చాలా వరకు అధిగమించగలదు. కనుక ముందుగా తను విస్తరించాలనుకొంటున్న రాష్ట్రాలలో అటువంటి బలమయిన వ్యక్తులను, పార్టీ పట్ల అభిమానం ఉన్నవారినీ గుర్తించి వారితోనే పార్టీ నిర్మాణ కార్యక్రమం ప్రారంభించాల్సి ఉంటుంది. త్వరలోనే కర్నాటక, తమిళనాడు,మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ ద్వీపాలలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ఆరంభించేందుకు తెదేపా కమిటీలను, వాటికి నేతృత్వం వహించేవారిని ఏర్పాటుచేసుకొంది. ఇరుగు పొరుగు రాష్ట్రాలలో తెదేపా మొదలుపెట్టబోయే సభ్యత్వ నమోదు ప్రక్రియకు వచ్చే స్పందనను బట్టి ఏ ఏ రాష్ట్రాలలో తెదేపా త్వరగా విస్తరించే అవకాశం ఉందనే విషయంపై ఒక అవగాహన ఏర్పడుతుంది.
ప్రస్తుతానికి తెదేపా విస్తరించాలనుకొంటున్న రాష్ట్రాలలో ఏ రాజకీయ పార్టీకి తెదేపా ఎన్నికల చిహ్నమయిన ‘సైకిల్’ గుర్తు లేదు కనుక వాటి నుండి ఈ విషయంలో అభ్యంతరం ఉండకపోవచ్చును. కానీ ఉత్తరాదికి విస్తరించాలనుకొంటే మాత్రం సమాజ్ వాదీ పార్టీకి కూడా సైకిల్ ఎనికల గుర్తుగా ఉంది కనుక అక్కడ ఆ పార్టీతో సమస్య ఎదురవవచ్చును. ఇటువంటి అనేక సాంకేతిక, రాజకీయ సమస్యల గురించి అధ్యయనం చేసి నివేదిక సమర్పించడానికి మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసారు. ఆ కమిటీ ఇంకా తన నివేదిక ఈయవలసి ఉంది. దాని ద్వారా మరికొన్ని ఇటువంటి సమస్యలు బయటపడవచ్చును. వాటన్నిటికీ తెదేపా పరిష్కారాలు కనుగొనవలసి ఉంటుంది. అప్పుడే జాతీయస్థాయిలో సైకిల్ సవారీ సజావుగా సాగుతుంది.